
టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సీరియల్స్, ఇతర కార్యక్రమాల టైటిల్స్ కు సంబంధించి యాజమాన్యాలకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ కొత్త ఆదేశాలు ఇచ్చింది. దీనిపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. “పలు రాష్ట్రాల్లో ప్రసారాలు అందిస్తున్న అనేక ఛానెళ్లు తమ కార్యక్రమాల ప్రారంభం, ముగింపు సందర్భాల్లో టైటిల్స్ ఇస్తుంటాయి. ఇవి ఎక్కువగా ఇంగ్లీష్ లోనే ఉంటున్నాయని మాకు ఫిర్యాదులు అందాయి. ఏ భాషలో అయితే ప్రసారాలు అందిస్తున్నారో .. అదే భాషలో ఈ క్రెడిట్ టైటిల్స్ ఇస్తే బాగుంటుంది. ఛానెళ్లకు దీనిపై ఆదేశాలు ఇస్తున్నాం” అన్నారు ప్రకాశ్ జవదేకర్.
ఇంగ్లీష్ కు వ్యతిరేకం కాదు.. అది వారి ఛాయిస్
ఇంగ్లీష్ బాషకు కేంద్రం వ్యతిరేకం కాదని ప్రకాశ్ జవదేకర్ క్లారిటీ ఇచ్చారు. ఏ భాషలో అయితే సీరియల్స్, కార్యక్రమాలు ఇస్తున్నారో అదే భాషలో టైటిల్స్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ఇలా చేస్తే భారతీయ భాషలను ప్రోత్సహించినట్టు అవుతుందని అన్నారు. అవసరమనుకుంటే వీటితో పాటు.. ఇంగ్లీష్ లో టైటిల్స్ ఇచ్చుకోవచ్చని.. అది ఆమోదమే అని అన్నారు. ఇంగ్లీష్ లో టైటిల్ క్రెడిట్స్ ఇవ్వాలా వద్దా అనేది వారి స్వేచ్ఛకే వదిలేశామని చెప్పారు.