ఆపేయమన్నా వినలేదు.. ఐసిస్ ఆపరేటివ్ యూసఫ్‌ భార్య

ఆపేయమన్నా వినలేదు.. ఐసిస్ ఆపరేటివ్ యూసఫ్‌ భార్య

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విధ్వంసానికి కుట్ర పన్నిన ఐసిస్‌ ఆపరేటివ్‌ మహ్మద్ ముస్తకీమ్ ఖాన్ అలియాస్‌ అబూ యూసఫ్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. యూసఫ్‌ గురించి అతడి భార్య స్పందించింది. తన భర్త గన్ పౌడర్‌‌తోపాటు ఇతర పేలుడు పదార్థాలను ఉత్తర్ ప్రదేశ్, బల్‌రామ్‌పూర్‌‌లోని తమ ఇంట్లో దాచాడని తెలిపింది. దీనిపై యూసఫ్‌ను తాను హెచ్చరించానని, కానీ తనను నిలువరించొద్దని అతడు చెప్పినట్లు ఆమె పేర్కొంది. తన భర్తను క్షమించాలని, తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. ఎక్కడికెళ్లి బతకాలని యూసఫ్‌ భార్య వాపోయింది. 36 ఏళ్ల యూసఫ్‌పై అతడి నాన్న కూడా స్పందించారు. తన కొడుకు చాలా మంచి వ్యక్తి అని, ఇప్పటివరకు ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేదని, అతడు టెర్రరిజంను ఎంచుకుంటాడని ఊహించలేదన్నారు.

‘పేలుడు పదార్థాల విషయం నాకు తెలియదు. అతడు పేలుడు పదార్థాలను సేకరిస్తున్నాడని తెలిసి ఉంటే యూసఫ్‌ను ఇంట్లో ఉండనిచ్చే వాడ్ని కాదు. పోలీసులు ఇంటికొచ్చి వాటిని గుర్తించాకే నాకూ తెలిసింది’ అని అబూ యూసఫ్‌ తండ్రి చెప్పారు. విచారణలో యూసఫ్‌ చెప్పిన వివరాలపై దర్యాప్తు చేయడానికి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు శనివారం అతడ్ని సొంతూరయిన బల్‌రామ్‌పూర్‌‌లోని బాధ్య భక్సైకి తీసుకెళ్లారు. అఫ్గాన్‌ ఐసిస్ గ్రూప్‌ చెప్పిన మేరకు ఢిల్లీలోని జన బాహుళ్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉగ్రవాద అటాక్‌కు ప్లాన్ చేసినట్లు పోలీసులు విచారణలో యూసఫ్‌ చెప్పాడని సమాచారం.