డబ్లిన్ ఎయిర్‌పోర్ట్‌లో నాపై వివక్ష చూపించారు.. సంగక్కర ఆరోపణలతో వివాదంలో ర్యాన్ఎయిర్ 

డబ్లిన్ ఎయిర్‌పోర్ట్‌లో నాపై వివక్ష చూపించారు.. సంగక్కర ఆరోపణలతో వివాదంలో ర్యాన్ఎయిర్ 

Kumar Sangakkara: శ్రీలంక క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కుమార సంగక్కర (Kumar Sangakkara)కు డబ్లిన్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ ఐరిష్ బడ్జెట్ ఎయిర్‌లైన్ సంస్థ 'ర్యాన్ఎయిర్ ' (Ryanair) గేట్ సిబ్బంది తన కుటుంబంపై తీవ్ర వివక్షకు పాల్పడినట్లు సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత హుందాతనానికి, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే సంగక్కర లాంటి సీనియర్ క్రీడాకారుడు బహిరంగంగా ఒక ఎయిర్‌లైన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతుంది. 

ర్యాన్ఎయిర్  సిబ్బందిపై సంగక్కర ఆగ్రహం:

కుమార సంగక్కర స్పందిస్తూ.. డబ్లిన్ ఎయిర్‌పోర్ట్‌లో ర్యాన్ఎయిర్  (Ryanair) గేట్ సిబ్బంది నన్ను వివక్షకు గురి చేశారు? నేను, నా కుటుంబం తొలిసారి అలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాం.. వారు మాట్లాడిన తీరు, బోర్డింగ్ విధానాన్ని నిర్వహించిన విధానం, బెదిరింపు ధోరణి నన్ను షాక్‌కు గురి చేసింది. ఏ ప్రయాణికుడికీ ఇలాంటి అనుభవం ఎదురుకాకూడదన్నాడు. ర్యాన్ఎయిర్ సిబ్బంది చేసిన చర్యల వివరాలను ఆయన పూర్తిస్థాయిలో బయటపెట్టనప్పటికీ, వారి ప్రవర్తన ఏమాత్రం సహించరానిదిగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు.

సంగక్కరకు పీర్స్ మోర్గాన్  మద్దతు: 

* సంగక్కర చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎయిర్‌లైన్ సిబ్బంది ప్రవర్తనను క్రీడాభిమానులు తీవ్రంగా ఖండించారు. 

* ప్రసిద్ధ జర్నలిస్ట్ పీర్స్ మోర్గాన్ స్పందన: సంగక్కర కంటే హుందాతనం, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు.. అలాంటి వ్యక్తే బహిరంగంగా వచ్చి ఫిర్యాదు చేశారంటే ఆ సిబ్బంది ప్రవర్తన ఎంత సిగ్గుచేటుగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నాడు. దీనిపై ర్యాన్ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

* ఐరోపాలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్: విమానాల సంఖ్య, ప్రయాణికుల రాకపోకల పరంగా ఐరోపాలోనే అతి పెద్ద డిస్కౌంట్ ఎయిర్‌లైన్‌గా గుర్తింపు పొందిన 'ర్యాన్ఎయిర్ '.. దిగ్గజ ఆటగాడి పట్ల ఇలా వ్యవహరించడంతో ఇప్పుడు తీవ్ర విమర్శలని ఎదుర్కొంటుంది.