బీఆర్ఎస్​పై నమ్మకం లేదు..ఇక మీరు ఏం చెప్పినా నమ్మం

బీఆర్ఎస్​పై నమ్మకం లేదు..ఇక మీరు ఏం చెప్పినా నమ్మం

పనులు చేశాకే ఓట్లకు రావాలి
మెదక్​జిల్లా బిట్ల తండాలో మదన్​రెడ్డి, నర్సాపూర్​ అభ్యర్థి సునీతారెడ్డిపై గిరిజనుల ఆగ్రహం 

కౌడిపల్లి, వెలుగు: ఏం చేశారని తండాకు ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ గిరిజన మహిళలు, యువకులు బీఆర్ఎస్​పార్టీ ప్రచారాన్ని అడ్డుకొని నిరసన తెలిపారు. మెదక్​జిల్లా నర్సాపూర్​ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా రెడ్డి, ఎమ్మెల్యే మదన్​రెడ్డి శుక్రవారం కౌడిపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగంపల్లి పంచాయతీ పరిధిలోని బిట్ల తండాలో గిరిజనులు ప్రచారాన్ని అడ్డుకుని నేతలను నిలదీశారు. 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రోడ్లు, అంగన్​వాడీ​, పంచాయతీ బిల్డింగ్ మంజూరు చేస్తామని, పోడు భూములకు పట్టాలిస్తామని గత ఎన్నికలప్పుడు చెప్పి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చిన వారికే డబుల్ బెడ్ రూమ్ ​ఇండ్లు ఇచ్చి, మిగతావారు పూరి గుడిసెల్లోనే మగ్గుతున్నా పట్టించుకోలేదన్నారు. అలాంటిది ఇప్పుడు ఓట్లు అడగడానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. 

తండాలో జాగలు ఉండి రూ.2 లక్షలు ఇస్తే డబుల్ ​బెడ్​రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పారని, 36 మంది అప్పు చేసి 2 లక్షలు ఇచ్చారని, కాంట్రాక్టర్ కొందరి ఇండ్లను పిల్లర్ల స్థాయిలోనే వదిలేసి వెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశారు. వైస్ ఎంపీపీ నవీన్​కుమార్ ను అడ్డుకొని తమ ఓట్లు కావాలంటే ముందు తండాలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే తండాకు రాకుండా గేటు ఏర్పాటు చేస్తామన్నారు. బీఆర్ఎస్​ పార్టీపై తమకు నమ్మకం పోయిందని, ఇక   ఏం చెప్పినా నమ్మెటోళ్లు ఇక్కడ లేరన్నారు. ఇంకోసారి తండాకు రావద్దంటూ తేల్చిచెప్పారు.