బంగ్లాదేశ్ సంక్షోభ నివారణకు నా దగ్గర ఓ ప్లాన్ ఉంది: BNP చైర్మన్ తారిక్ రహమాన్

బంగ్లాదేశ్ సంక్షోభ నివారణకు నా దగ్గర ఓ ప్లాన్ ఉంది: BNP చైర్మన్ తారిక్  రహమాన్

ఢాకా: బంగ్లాదేశ్‏లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ నివారణకు తన వద్ద ఓ ప్లాన్ ఉందని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్ పీ) యాక్టింగ్ చైర్మన్, ఆ దేశ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్  రహమాన్  తెలిపారు. దాదాపు 17 సంత్సరాల ప్రవాస జీవితం తర్వాత బుధవారం ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. కాగా, గురువారం ఆ దేశ రాజధాని ఢాకాలో జరిగిన భారీ ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

బంగ్లాదేశ్ ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కులను, భావ ప్రకటనా స్వేచ్ఛను తిరిగి పొందాలని కోరుకుంటున్నారని రహమాన్  పేర్కొన్నారు. అందుకోసం తన వద్ద ఒక ప్రణాళిక ఉందని ప్రకటించారు. అందరి మద్దతుతో దానిని సాధించుకుందామని, దేశ పునర్నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. బంగ్లాదేశ్ అన్ని మతాల ప్రజలకు చెందినదని పేర్కొన్నారు. 

తాము సురక్షితమైన బంగ్లాదేశ్‌‌‌‌ను నిర్మించాలనుకుంటున్నామని చెప్పారు. ప్రతి- స్త్రీ, పురుషుడు లేదా బిడ్డ తమ ఇంటి నుంచి బయటకు వెళ్లి సురక్షితంగా తిరిగి రావాలని, దేశంలో శాంతి, క్రమశిక్షణ, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి బీఎన్​పీ కృషి చేస్తుందని రహమాన్​స్పష్టం చేశారు. అనంతరం ఆయన గత నెల రోజులుగా ఎవర్‌‌‌‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి, మాజీ ప్రధాని జియా వద్ద వెళ్లి పరామర్శించారు.  

తారిక్ రహమాన్‎కు ఘన స్వాగతం

గత 17 సంవత్సరాలకు పైగా యూకేలో స్వీయ-ప్రవాసాన్ని గడిపిన తారిక్.. విద్యార్థి లీడర్​హదీ మరణం తర్వాత దేశంలో నెలకొన్న గందరగోళం మధ్య తన స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆయన వెంట తన భార్య జుబైదా, కుమార్తె జైమా ఉన్నారు. కాగా, యూకే నుంచి తిరిగి వచ్చిన రెహమాన్‌‌‌‌ను స్వాగతించడానికి బీఎన్‌‌‌‌ పీ నాయకులు, మద్దతుదారులు బనాని ఎయిర్​పోర్ట్​కు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.  అనంతరం ఆయన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనస్‌‌‌‌ను కలిశారు. దేశంలో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. 

మరో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్‌‌‌‌లో మరో హిందూ యువకుడిని కొట్టి చంపారని గురువారం స్థానిక మీడియా వెల్లడించింది. 29 ఏండ్ల అమృత్ మోండల్ (అలియాస్ సామ్రాట్) బుధవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో రాజ్‌‌‌‌బరీ జిల్లాలోని పాంగ్షా ఉపజిల్లాలో హత్యకు గురయ్యాడు. గత ఏడాది షేఖ్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత సమ్రాట్ దేశం విడిచి పారిపోయి.. ఇటీవలే కలిమోహర్ యూనియన్‌‌‌‌లోని హొసైన్‌‌‌‌దంగా గ్రామానికి తిరిగి వచ్చాడు. 

అయితే, బుధవారం రాత్రి సుమారు 11 గంటలకు అతడు, అతని అనుచరులు కొందరు సభ్యులు ఓ గ్రామస్తుడి ఇంటికి వెళ్లి బలవంతంగా డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించారని, దీంతో ఇతర గ్రామస్తులు వచ్చి సామ్రాట్‌‌‌‌ను పట్టుకుని కొట్టి చంపేశారని పోలీసులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.