
- అదే నిజమైతే మంచిదేనన్న అగ్రరాజ్యం అధ్యక్షుడు
- ఈ విషయంపై సమాచారం లేదన్న విదేశాంగ శాఖ
వాషింగ్టన్: భారత్ పై 25 శాతం టారిఫ్ లు వేసిన తర్వాత రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతిని నిలిపివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒకవేళ ఈ వార్తలు నిజమే అయితే భారత ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నట్లేనని పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు.
‘‘ఇకపై రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయబోదని అనుకుంటున్నా. ఇప్పటికే ఇంధన దిగుమతిని భారత్ నిలిపివేసిందని రిపోర్టులు అందాయి. ముందుముందు ఏమవుతుందో చూద్దాం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినా.. ఆ దేశం నుంచి డిస్కౌంట్ ధరకు ఆయిల్ దిగుమతి చేసుకోవడంపై ట్రంప్ తో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా భారత్ పై ఇంతకుముందు తీవ్రంగా విమర్శలు చేశారు.
కాగా.. రష్యా నుంచి ఇంధన దిగుమతులను ఆపివేసినట్లు తమకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. దేశ ప్రయోజనాలు, మార్కెట్ లో పరిస్థితుల ఆధారంగా ఇంధనాన్ని భారత్ దిగుమతి చేసుకుంటుందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
మరోవైపు రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయకూడదని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో గత కొద్దిరోజులుగా ఆ దేశం నుంచి ఇంధనం కొనుగోలు చేయడాన్ని భారత రిఫైనరీ కంపెనీలు నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా.. ఇంధన దిగుమతిలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశమైన భారత్.. రష్యా నుంచి అత్యధికంగా క్రూడాయిల్ కొనుగోలు చేస్తున్నది.