రిటైర్ అవుతున్నానంటూ పీవీ సింధు ట్వీట్

రిటైర్ అవుతున్నానంటూ పీవీ సింధు ట్వీట్

హైదరాబాద్: ఇండియన్ టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు రిటైర్మెంట్ ప్రకటించింది. కానీ.. బ్యాడ్మింటన్‌‌కు కాకుండా ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులకు రిటైర్మెంట్ ఇస్తున్నట్టు సింధు ట్వీట్ చేసింది. ప్రతికూలతల నుంచి, గుర్తు తెలియని దానిపై నియంత్రణ లేకపోవడం నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు తెలిపింది. మరీ ముఖ్యంగా సబ్ స్డాండర్డ్ హైజీన్ నుంచి, కరోనా వైరస్ మీద భయం లేని ప్రవర్తన నుంచి రిటైర్ కావాలనుకుంటున్నట్టు ట్విట్టర్‌‌లో రాసుకొచ్చింది సింధు. కరోనా మహమ్మారి తన కళ్లు తెరిపించిందని పేర్కొంది. ప్రత్యర్థులను ఓడించేందుకు తాను చాలా కఠిన శిక్షణ తీసుకున్నానని, చివరి షాట్ వరకు పోరాడానని.. భవిష్యత్‌‌లోనూ  పోరాడుతానని స్పష్టం చేసింది. అయితే ప్రపంచమంతా విస్తరించిన కనిపించని కరోనా వైరస్‌‌ను ఎలా ఓడించాలో తెలియడం లేదని తెలిపింది. కొన్ని నెలలుగా ఇంట్లోనే కూర్చుంటున్నా.. బయటకు వెళ్లాల్సి వచ్చిన ప్రతీసారి ప్రశ్నించుకోవాల్సి వస్తోందంటూ ట్వీట్‌‌లో పేర్కొంది.

అక్టోబర్‌‌లో ముగిసిన డెన్మార్క్ ఓపెన్‌‌లో పీవీ సింధు ఆడలేదు. దేశానికి ప్రాతినిధ్యం వహించకపోవడం అదే చివరిదని సింధు స్పష్టం చేసింది. ‘వైరస్‌‌ను కలసికట్టుగా పారదోలాలి. మంచిగా సన్నద్ధమవ్వాలి. పోరాటం నుంచి డైవర్ట్ కావొద్దు. ఈ రోజు మనం తీసుకునే చాయిస్.. మన ఫ్యూచర్‌‌ని, తర్వాతి తరం భవిష్యత్‌‌ను కూడా నిర్ణయిస్తుంది. అపూర్వమైన సందర్భాల్లో అపూర్వమైన చర్యలే అవసరం. డెన్మార్క్ ఓపెన్ ఆడలేకపోయినా ఆసియా ఓపెన్ కోసం సిద్ధమవుతున్నా’ అని సింధు వివరించింది.