ఫాదర్, బ్రదర్తో ఉండాలనుకుంటున్నా : ప్రిన్స్ హ్యారీ

ఫాదర్, బ్రదర్తో ఉండాలనుకుంటున్నా : ప్రిన్స్ హ్యారీ

ప్రిన్స్ హ్యారీ కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి కింగ్ ఛార్లెస్, సోదరుడు ప్రిన్స్ విలియంలను కలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజీ పడటానికి వారు ఎంత మాత్రం ఇష్టపడలేదు. నా తండ్రిని, సోదరుడిని తిరిగి కలవాలని నేను కోరుకుంటున్నాను. కానీ మమ్మల్ని విలన్లుగా ఉంచడం మంచిదని వారు భావిస్తున్నారు’’ అని చెప్పారు.

ప్రిన్స్ హ్యారీ ఓ అమెరికన్ మీడియా సంస్థకు ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో.. తనకు, తన భార్యకు బహిరంగంగా మద్దతిచ్చేందుకు రాజవంశం తిరస్కరించిందని చెప్పారు. తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేసిందని  ఆరోపించారు. ‘‘నిన్ను కాపాడటానికి మేం ప్రకటన చేయలేం. కానీ కుటుంబంలోని ఇతర సభ్యుల కోసం నువ్వు ప్రకటన ఇవ్వాలి’’ అని రాజ కుటుంబీకులు తనతో చెప్తున్నారన్నారు. ప్రిన్స్ హ్యారీ జీవిత చరిత్ర పుస్తకం స్పేర్ ఆవిష్కరణకు రెండు రోజుల ముందు అంటే జనవరి 8న ఈ రెండు ఇంటర్వ్యూలు ప్రసారంకానున్నాయి. 

ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్‌లను అధికారికంగా డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ ససెక్స్ అంటారు. వీరు 2020 మార్చిలో రాజవంశం నుంచి వైదొలిగారు. మీడియాకు దూరంగా ఉండాలని, అమెరికాలో కొత్త జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత వీరిద్దరూ తాము రాజ కుటుంబంలో ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ, కొన్ని ఆరోపణలు కూడా చేశారు. రాజ కుటుంబీకులు తమను అవమానకరంగా చూసేవారని ఆరోపించారు.