కొండారెడ్డిపల్లికి వస్తా.. ఎన్ని ఓట్లు పోయాయో తేలుద్దాం

కొండారెడ్డిపల్లికి వస్తా.. ఎన్ని ఓట్లు పోయాయో తేలుద్దాం
  •  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు సవాల్‌‌‌‌‌‌‌‌  
  • మోదీ కుటుంబంపై కాంగ్రెస్​ దిగజారుడు వ్యాఖ్యలు దారుణం
  • రాష్ట్రంలో కరువుతో జనం అల్లాడుతుంటే ఢిల్లీలో ర్యాలీలా?
  • 2న ‘అరాచకం హఠావో’ పాదయాత్ర.. ముఖ్య అతిథిగా అమిత్ షా 

హైదరాబాద్, వెలుగు: ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపుపై వాస్తవాలు తేల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సొంతూరైన కొండారెడ్డిపల్లికి వచ్చేందుకు తాము సిద్ధమని, తేదీ, సమయం రేవంత్​చెప్పాలని సవాల్ విసిరారు. ఆయన గ్రామంలో ఎన్ని ఓట్లు అక్రమంగా డిలీట్ అయ్యాయో నిరూపించాలని డిమాండ్ చేశారు. 

సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సర్’లో అర్హులైన ఏ ఒక్కరి ఓటునూ తొలగించలేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగించారంటూ కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తున్నదని, వాస్తవానికి ఏఎస్‌‌‌‌‌‌‌‌డీడీ నిబంధనల ప్రకారమే వాటిని గుర్తించారని తెలిపారు. ఇందులో 2.8 కోట్ల మంది చనిపోయినవారని,3 కోట్ల మందికి సరైన అడ్రస్ లేదని, 6.3 కోట్ల మంది శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లినవారని, కోటి మంది నకిలీ ఓటర్లని వెల్లడించారు. 

మోదీ పేరెంట్స్​పై వ్యాఖ్యలు దుర్మార్గం

ప్రధాని మోదీ తల్లిదండ్రులపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే  చేసిన వ్యక్తిగత దూషణలు ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సామాన్య చాయ్‌‌‌‌‌‌‌‌వాలా ప్రధాని కావడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నదన్నారు. 

మోదీ కుటుంబంపై అవమానకర వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని సమస్యలను గాలికొదిలి సీఎం రేవంత్ రెడ్డి  ఢిల్లీలో ధర్నాల పేరిట రాజకీయం చేస్తున్నారని రాంచందర్ రావు విమర్శించారు.

 రాష్ట్రంలో 330 మండలాలు తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నాయని, 6 వేల చెరువుల్లో కేవలం 500 చెరువుల్లోనే నీరు మిగిలిందని, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో రోజూ 8 వేల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి దాపురించిందని గుర్తుచేశారు.

నవంబర్ 2న ‘అరాచకం హఠావో’ పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో సృష్టిస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని రాంచందర్ రావు హెచ్చరించారు. ఈ క్రమంలో ‘లోక్‌‌‌‌‌‌‌‌తంత్ర్ బచావో – అరాచకం హఠావో’ పేరుతో నవంబర్ 2న బీజేపీ ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ పాదయాత్రకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు వెల్లడించారు.