నన్ను ఇండియాకు తీసుకొస్తే ఆత్మహత్య చేసుకుంటా: నీరవ్ మోడీ

V6 Velugu Posted on Nov 07, 2019

లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ. 13,500 కోట్లు ఎగ్గొట్టిన కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్‌ను లండన్ కోర్టు మరోసారి తిరస్కరించింది. నీరవ్ మోడీపై నాలుగు మిలియన్ పౌండ్ల సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటూ, ఆయన గృహ నిర్బంధంలోనే ఉండాలనే షరతు కూడా ఉంది. అయినప్పటికీ, మోడీకి బెయిలివ్వడానికి న్యాయమూర్తి తిరస్కరించారు. ఇలా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం ఇది నాల్గొసారి. ఇలా ప్రతీసారి బెయిల్ తిరస్కరణకు గురవుతుండటంతో తనను ఇండియాకు తీసుకొస్తే ఆత్మహత్య చేసుకుంటానని నీరవ్ మోడీ బెదిరించాడు. పీఎన్‌బీ స్కామ్ కేసులో నీరవ్ మోడీతో పాటూ ఆయన మేనల్లుడు మోహుల్ చోక్సీ కూడా నిందితుడే. అయితే ఈ కుంభకోణం వెలుగులోకి రాకముందే వీరిద్దరూ గత ఏడాది జనవరిలోనే దేశం విడిచి పారిపోయారు. నీరవ్ మోడీ ప్రస్తుతం సౌత్ వెస్ట్ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు. ఇండియాకు చెందిన దర్యాప్తు సంస్థలు మరియు కోర్టులు నీరవ్ మోడీకి ఎన్నోసార్లు సమన్లు ​​ఇచ్చినప్పటికీ ఆయన ఇండియాకు తిరిగి రాలేదు. అందువల్ల నీరవ్ మోడీని కేసు దర్యాప్తు కోసం తమకు అప్పగించాలని లండన్ ప్రభుత్వాన్ని ఇండియన్ గవర్నమెంట్ కోరుతుంది.

Tagged bail petition, suicide, London court, Indian Govt, Nirav Modi, Mehul Choksi, PNB Scam

Latest Videos

Subscribe Now

More News