మేలో పార్టీ పెడతా.. సిద్దిపేట నుంచే పోటీ చేస్తా: జాగృతి అధ్యక్షురాలు కవిత

మేలో పార్టీ పెడతా.. సిద్దిపేట నుంచే పోటీ చేస్తా: జాగృతి అధ్యక్షురాలు కవిత
  • బీజేపీ కాదు.. రాష్ట్రంలో మేమే ప్రధాన ప్రతిపక్షం
  • మా పార్టీకి తెలంగాణ మదర్ బోర్డు
  • బీఆర్ఎస్ వాళ్లు చాలా మంది నాతో టచ్ లో ఉన్నరు
  • ఎవరనేది సందర్భం వచ్చినప్పుడు చెప్తా
  • చుట్టూ తెలంగాణ ద్రోహులని పెట్టుకొని కేటీఆర్ మాట్లాడుతున్నారని కామెంట్

హైదరాబాద్, వెలుగు: మే మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకొని పార్టీ ఏర్పాటు చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని.. తెలంగాణ అనేది తమ పార్టీ ‘మదర్ బోర్డ్’ అని.. సామాజిక తెలంగాణే తమ లక్ష్యమన్నారు. ప్రజల కోణంలో పార్టీ నడుపుతామని తెలిపారు. గురువారం హైదరాబాద్​లోని జాగృతి ఆఫీసులో మీడియాతో ఆమె మాట్లాడారు. అనంతరం చిట్ చాట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. 

బోధన్ నుంచి కూడా అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో తామే ప్రధాన ప్రతిపక్షమని, రాష్ట్రంలో బీజేపీ ఉండదని ఆమె అన్నారు. తాము ఎప్పుడూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రశిస్తూనే ఉంటామని తెలిపారు. “జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు మా గుర్తు వస్తే ఆ గుర్తుపైనే పోటీ చేస్తం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ పొత్తుతో పోటీ చేస్తాం. పెద్దపల్లి మున్సిపాలిటీలో మేమే ప్రధాన ప్రతిపక్షం. మా పార్టీలో యువతకు పెద్దపీట వేస్తం.

 బీఆర్ఎస్ వాళ్లు చాలా మంది నాతో టచ్ లో ఉన్నారు. వారు ఎవరనేది సందర్భం వచ్చినప్పుడు చెప్తా. షర్మిల ఫెయిల్యూర్ లీడర్ కాదు.. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షరాలు. పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన మగవారి గురించి ఎందుకు చర్చ చేయరు. ఓన్లీ ఆడవాళ్లనే అంటారా. రాజగోపాల్ రెడ్డి పార్టీ పెడతా అన్నారు. బీజేపీలో చేరారు. ఇప్పుడు  మళ్లీ పార్టీ అంటున్నారు” అని కవిత వ్యాఖ్యానించారు. 

ఢిల్లీకి కేబినెట్​.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే

రాష్ట్ర కేబినెట్ ను ఢిల్లీకి తీసుకెళ్లటం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని కవిత అన్నారు. హరీశ్ రావు చెప్పింది నిజమేనని.. అయితే, గతంలో కేబినెట్ ఎర్రవల్లికి వెళ్లేదని, ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నదని పేర్కొన్నారు. కేబినెట్ సమావేశాలు సచివాలయంలో జరిగితేనే బాగుంటుందని ఆమె అన్నారు. “ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకొని కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఎవరు ఉద్యమకారులో, ఎవరు ఉద్యమ ద్రోహులో ప్రజలే తేల్చుతారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని గత ప్రభుత్వం బిల్లు పెట్టింది. 

కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చింది. ఇప్పటికే బిల్లు పాస్ అయి ఉంది. కాంగ్రెస్ కొత్తగా చేసేదేమీ లేదు. అమలు చేస్తే సరిపోతుంది. అది జరిగితే ఆర్టీసీ ప్రభుత్వ సంస్థగా మారుతుంది. ఆర్టీసీ కార్మికుల కాళ్లలో ముల్లు గుచ్చితే నోటితో తీస్తా అని సీఎం అన్నారు. కానీ, ఇప్పుడు వారి గుండెల్లో గాయమవుతున్న సరే కన్ను తిప్పి చూడటం లేదు. మహాలక్ష్మి పథకం వచ్చాక ఆర్టీసీ సిబ్బందిపై ఒత్తిడి పెరిగింది. 16 నుంచి 18 గంటలు పనిచేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. 

జనంబాటలో తిరుగుతుంటే ఫ్రీ బస్ ఎందుకు అని మహిళలే ప్రశ్నిస్తున్నారని కవిత అన్నారు. ఫ్రీ బస్ ఉంటే అందుకు తగిన విధంగా బస్సుల సంఖ్యను ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ‘‘ఆర్టీసీకి ఇప్పుడు చైర్మన్ లేడు, యూనియన్లు కూడా లేవు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన చలో సెక్రటేరియేట్ కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలుపుతున్నాం” అని ఆమె తెలిపారు.

ఆర్టీసీని మేఘాకు అప్పగించే కుట్ర

ఆర్టీసీని క్రమంగా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని, మేఘాకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత పేర్కొన్నారు. “ఎలక్ట్రిక్ బస్సులు కొని వారికి కరెంట్, డిపోలను ఆర్టీసీ నుంచే ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కోసం అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకుంటున్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉంటే బాధ్యత ఉండదు. ఆర్టీసీ ఉద్యోగులనే నియమించుకోవాలి. 

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత తీసుకోవాలి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అందరూ మంత్రులను కలవాలని ఆయన చెబుతున్నారు. మరి రవాణా శాఖ మంత్రి ఉండి ఏం ప్రయోజనం? ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెచ్ఆర్ఏ కట్ చేశారు. మరి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులా కాదా చెప్పాలి” అని ఆమె డిమాండ్ చేశారు.