ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరిస్తా : కవిత

ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరిస్తా  :  కవిత

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరిస్తానని తెలిపారు. ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగిన ఎదుర్కొంటామని చెప్పారు.  శ్రేణులు బలంగా మనోదైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అనిచివేతను, దొంగ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలను చట్టం పైన నమ్మకం ఉంచి ఎదుర్కొంటామని కవిత తెలిపారు.   

ఈడీ అక్రమ అరెస్టును న్యాయపరంగా, శాంతియుతంగా ఎదుర్కొంటామని  బీఆర్ఎస్  పార్టీ నాయకులు తెలిపారు. కవిత అరెస్టుని అడ్డుకోవద్దని.. పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలను కోరారు.  

ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో  ఆమె ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారీగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, మహిళలు కవిత ఇంటి వద్దకు చేరుకున్నారు. కవిత అరెస్ట్‌కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఇంటి దగ్గర కేంద్ర బలగాలు మోహరించాయి.

ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇవాళ రాత్రికి కవితను ఫ్లైట్‌లో హస్తినకు తరలించనున్నారు. కవితను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకెళ్లనున్నారు ఈడీ అధికారులు.  న్యాయవాదులతో కలిసి కేటీఆర్, హరీశ్ రావు కూడా ఢిల్లీ వెళ్తారని సమాచారం.