పదేండ్లు కష్టపడుత.. వందేండ్ల డెవలప్​మెంట్​ చేస్త : సీఎం రేవంత్ రెడ్డి

పదేండ్లు కష్టపడుత.. వందేండ్ల డెవలప్​మెంట్​ చేస్త :  సీఎం రేవంత్ రెడ్డి

ఇండియా టుడే, టైమ్స్ నౌ కు ఇచ్చిన ఇంటర్యూలలో దేశ సమస్యలపై ఎక్కువ మాట్లాడారు. దేశ రాజకీయాల్లోకి వెళ్లే చాన్స్​ ఉందా? 

దేశ సమస్యలపై నాకున్న అవగాహన మేరకు మాట్లాడుతున్న. పదేండ్లు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంట. పదేండ్లు  కష్టపడి వందేండ్లకు కావాల్సిన ప్రణాళికలు రూపొందించి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడం, రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడటమే నా జీవిత లక్ష్యం. పదేండ్ల తర్వాత పార్టీ పరిస్థితులు, ప్రకృతి సహకరిస్తే, నా దగ్గర ఎనర్జీ, విస్​డమ్​ ఉంటే అప్పుడు ఆలోచిస్త. 2024 నుంచి 2034 వరకు అకుంఠిత దీక్షతో ఎంత కష్టమైనా.. నిలబడి కాలానుగుణంగా తెలంగాణ కోసం పని చేయడమే నా లక్ష్యం. నాకు చాలా స్పష్టత ఉంది. ప్రణాళిక ప్రకారం పని చేస్త. పదేండ్లు తెలంగాణ కోసమే అంకితమవుత. ఎక్కడికి పోయేదీ లేదు. 

ఈ పదేండ్లు ఇక్కడే ఉంటా.. పదేండ్ల తర్వాత పార్టీ ఆదేశిస్తే, పరిస్థితులు అనుకూలిస్తే ఇతర బాధ్యతలు తీసుకుంట. లేదంటే నా అనుభవాన్ని వచ్చే జనరేషన్స్​కు అందిస్త. కేసీఆర్​ లా సంకుచిత స్వభావంతో నేను నా కొడుకు, మనుమడు, నా కులం, నా కుటుంబం అని దిక్కుమాలిన రాజకీయం చేయను. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకు ఆదర్శంగా ఉండే రాజకీయం చేయాలని లైఫ్​లైన్​ గీసుకున్న. యువత రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు గాంధీలు, సుభాష్​చంద్రబోస్​ వంటి వారిలా మనల్ని కీర్తించకపోయినా పచ్చి బూతులు తిట్టకుండా ఉంటే చాలు. కేసీఆర్​ ఏం చేసిండు? వాళ్ల ఫ్యామిలీలో కొడుకును తండ్రి నమ్ముతలేడు. తండ్రిని కొడుకు నమ్ముతలేడు, తండ్రిని బిడ్డ నమ్మలేని పరిస్థితి ఉంది.

 తెలంగాణ సమాజం ఇప్పుడు వారిని బహిష్కరించింది. ఇన్నేళ్లు ఇంత కొట్లాడినా.. ఇంత సాధించిన అని కేసీఆర్​ అంటున్నడు. ఏం సాధించిండు? ఆయన కూతురు జైలుకు పోతే తెలంగాణ సమాజం స్పందించిందా? ఆయన కాలు విరిగితే ఎవరైనా  పరామర్శించడానికి వెళ్లారా? ఆయన ఏం అనుకుంటుండో, ఏం చెప్పుకుంటుండో అర్థం కావడం లేదు. ఆయన వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం లేదు. నేను చంద్రశేఖరరావులా ఉండదల్చుకోలేదు. కాకిలా వేల సంవత్సరాలు ఉండదల్చుకోలేదు. ఉన్న కొద్దికాలమైనా క్వాలిటీ తో ప్రజల పట్ల గౌరవంగా ఉండదల్చుకున్న. అంతేకానీ అధికారం దొరికింది కదా అని ఆదరాబాదరాగా అంతా తినేసి ఎక్కువ కాలం  సీటును పట్టుకుని వేలాడుతూ, ప్రజల ఛీకొట్టినా, ఈ సీటు నాకే కావాలంటూ కాకిగోల కూడా నేను చేయదల్చుకోలేదు. సరిగ్గా పదేండ్లు 2024– 2034 వరకు వందశాతం తెలంగాణ కోసం కమిట్​మెంట్​తో పని చేస్త. తర్వాత హాయిగా జాతీయ స్థాయిలోనో లేక పోతే పిల్లలతో గడుపుతా. లేదా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారికి సలహాలు సూచనలు చేసుకుంటూ కాలం గడుపుదామన్నదే నా ఆలోచన. అంతేకానీ చెట్టుమీది కోతిలా దుంకుడు వ్యవహారాలు మాత్రం చేయను.