
- పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టినమని వెల్లడి
- 2035 వరకు ‘సుదర్శన చక్ర’ సిద్ధమవుతుంది: ఏపీ సింగ్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో మన ఎయిర్ ఫోర్స్ సత్తా ప్రపంచం చూసిందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్అన్నారు. పాక్‌కు చెందిన 10 ఫైటర్ జెట్స్‌ను కూల్చేశామని, ఇందులో ఎఫ్ 16, జే 17 జెట్స్కూడా ఉన్నాయని తెలిపారు. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా శుక్రవారం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కేంద్ర సర్కారు తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని, శత్రువుల స్థావరాలను గురిచూసి కొట్టడంతో పాక్‌లోని ఉగ్ర స్థావరాలతో పాటు రాడార్ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రన్‌వేలు, హ్యాంగర్లు, ఫైటర్ జెట్స్ ధ్వంసమయ్యాయని అన్నారు. 300 కిలో మీటర్ల దూరంలో ఉన్న శత్రువుల లక్ష్యాలను గురిచేసి కొట్టామని చెప్పారు. భవిష్యత్తు సవాళ్లను అధిగమించేందుకు రక్షణ రంగంలో స్వావలంబన కోసం ‘సుదర్శన చక్ర’ ను తయారుచేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే త్రివిద దళాలు పని ప్రారంభించాయని వెల్లడించారు. ఈ కవచంతో కీలకమైన వ్యవస్థలకు రక్షణ కల్పిస్తామని, దేశాన్ని శత్రు దుర్బేధ్యంగా తయారు చేస్తామని పేర్కొన్నారు.
లక్ష్యాన్ని సాధించినం
ఆపరేషన్ సిందూర్ సమయంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించామని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్తెలిపారు. ఒక స్పష్టమైన టార్గెట్ పెట్టుకొని ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించామని, అది నెరవేరగానే ఘర్షణను నిలిపివేశామని చెప్పారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచామని తెలిపారు.
ఆపరేషన్సిందూర్తో పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టామని, కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆ దేశమే ముందుకు తెచ్చిందని గుర్తుచేశారు. ఆ దేశం ప్రతిపాదించడంతోనే దీనిపై ఒప్పందం చేసుకున్నామని, ఇందులో ఎవరి జోక్యం లేదని అన్నారు. మన సైన్యం అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలన్నీ గేమ్ చేంజర్లేనని చెప్పారు. భవిష్యత్తులో పాకిస్తాన్ మళ్లీ రెచ్చగొడితే.. భారత సైన్యం చేతిలో చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు.