ఫ్రాన్స్‌ నుంచి మరో రెండు మిరాజ్ ఫైటర్స్

ఫ్రాన్స్‌ నుంచి మరో రెండు మిరాజ్ ఫైటర్స్

న్యూఢిల్లీ: ఓ వైపు చైనా, మరోవైపు పాక్ ముష్కరుల కవ్వింపులతో దేశ సరిహద్దులో కొన్ని నెలలుగా ఉద్రికత్త వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత సేన్యాన్ని శత్రు బేధ్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది. రఫెల్, ఎస్‌ 400 లాంటి అధునాతన ఫైటర్లు, మిస్సైళ్లను సమకూర్చుకుంటోంది. తాజాగా ఇండియన్ ఎయిర్‌‌ ఫోర్స్‌లోని మిరాజ్ 2000 స్క్వార్డ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఫ్రాన్స్‌ నుంచి మరో రెండు ఫైటర్ జెట్స్‌ను కొనుగోలు చేసింది. గ్వాలియర్‌‌లోని ఎయిర్‌‌ బేస్‌కు రెండు మిరాజ్ 2000 ఫైటర్‌‌ జెట్స్ చేరుకున్నాయి. అయితే ఇవి రెండు ట్రైనర్ వర్షన్‌ ఎయిర్‌‌క్రాఫ్ట్‌లని, వీటిని మిరాజ్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌లో భాగంగా హిందుస్థాన్ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)లో అప్‌గ్రేట్‌ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

50 దాటిన మిరాజ్‌లు

మిరాజ్ ఫైటర్ జెట్స్‌ సంఖ్యను 50కి పెంచుకోవాలన్న టార్గెట్‌లో భాగంగా ఇండియన్ ఎయిర్‌‌ ఫోర్స్‌ కొత్తగా ఫ్రాన్స్‌ నుంచి వీటిని కొనుగోలు చేసింది. 1980 నుంచి ఇప్పటి వరకూ వేర్వేరు బ్యాచ్‌లుగా భారత్ 51 మిరాజ్ ఫైటర్లను కొనుగోలు చేసింది. ఈ మొత్తం ఫైటర్స్ మూడు స్క్వార్డన్స్‌గా గ్వాలియర్‌‌ ఎయిర్‌‌ ఫోర్స్‌ స్టేషన్‌లోనే ఉన్నాయి. కార్గిల్ యుద్ధం నుంచి 2019లో పాకిస్థాన్‌లోని బాలాకోట్‌ జైషే మహ్మద్ టెర్రరిస్టుల క్యాంపులపై చేసిన ఎయిర్‌‌ స్ట్రైక్స్ వరకూ మిరాజ్ ఫైటర్స్‌ చాలా కీలక పాత్ర పోషించాయి.