మరోసారి సత్తా చాటిన క్రూయిజ్ మిసైల్

మరోసారి సత్తా చాటిన క్రూయిజ్ మిసైల్

న్యూఢిల్లీ: బ్రహ్మోస్ మిసైల్ మరోసారి సత్తా చాటింది. సుఖోయ్ ఫైటర్ జెట్ నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్​ను గురువారం ప్రయోగించగా.. సముద్రంలోని  షిప్ టార్గెట్​ను విజయవంతంగా ఛేదించిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ టెస్టులో మిసైల్ సమర్థంగా పని చేసిందని తెలిపాయి. సౌండ్ కంటే 2.8 రెట్లు (గంటకు 3,457 కిలోమీటర్లు) స్పీడ్ తో దూసుకెళ్లే బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ గా ప్రయాణించే మిసైల్ గా పేరు పొందింది. 

నేలపై నుంచి, ఆకాశం నుంచి, సముద్రంలో షిప్​ల నుంచి కూడా ప్రయోగించేలా దీనిని డిజైన్ చేశారు. సుఖోయ్ నుంచి ప్రయోగించే సాధారణ వెర్షన్ బ్రహ్మోస్ సుమారు 290 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్లను ధ్వంసం చేస్తుంది. అయితే, దీని రేంజ్ ను పెంచి పరీక్షించడం ఇది రెండోసారి. గత మే నెలలో దీని రేంజ్ ను 350 కిలోమీటర్లకు పెంచి రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. తాజాగా సముద్రంలోని  400 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న టార్గెట్ నూ కచ్చితత్వంతో ధ్వంసం చేసి సత్తా చాటింది.