లాక్ డౌన్ ఎత్తేస్తే..6 పాయింట్స్​ ఫార్ములా!

లాక్ డౌన్ ఎత్తేస్తే..6 పాయింట్స్​ ఫార్ములా!

హైదరాబాద్‌‌, వెలుగు: లాక్​డౌన్​ను ఎత్తివేసే పరిస్థితే ఉంటే.. ఆంక్షలు కొనసాగించాలని,  ఒక్కసారిగా జనం బయటికొస్తే వైరస్  మళ్లీ వ్యాపించే ప్రమాదం ఉందని ఇండియన్​ అసోసియేషన్‌‌ ఆఫ్​ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్‌‌(ఐఏపీఎస్‌‌ఎం) ఎక్స్​పర్ట్స్​ హెచ్చరించారు. ఇందు కోసం 6 పాయింట్స్​ ఫార్ములాను పాటించాలని వాళ్లు సిఫార్సు చేశారు. వాటితోపాటు పలు అంశాలను ప్రస్తావించారు. లాక్‌‌డౌన్ సడలింపులపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఐఏపీఎస్ఎం చేసిన ఫార్ములా, సూచనలను స్టడీ చేస్తోంది. ఈ నెల 7తో రాష్ట్ర  ప్రభుత్వం విధించిన లాక్‌‌డౌన్  గడువు ముగియనుంది. ఐఏపీఎస్ఎం సూచనలను పరిశీలిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

వీటిపైనా ఫోకస్ తప్పనిసరి..

ప్రయాణాలపై ఆంక్షలు: బస్సులు, రైళ్లు నడిపేందుకు అనుమతివ్వాలి. ఒక సీటుకు ఒక్కరిని మాత్రమే అనుమతించాలి. ప్రయాణంలో మాస్క్ తప్పనిసరి చేయాలి. సింగిల్ ప్యాసింజర్‌‌‌‌తో ఆటోలు, ఇద్దరు ప్యాసింజర్లతో క్యాబ్ లు నడిపించుకోవచ్చు. ఆదివారం, హాలిడేస్‌‌లో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను పూర్తిగా బంద్ పెట్టాలి. ఇంటర్నేషనల్ ట్రావెల్‌‌ను మరో నెల రోజుల వరకు రద్దు చేయాలి.

వృద్ధులు, పేషెంట్లు జాగ్రత్త: 60 ఏండ్లు పైబడిన వృద్ధులను ఇంటికే పరిమితం చేయాలి. ఇంటి వద్దకే నిత్యావసరాలు అందించేలా సర్కారు చర్యలు తీసుకోవాలి.  50 ఏండ్ల కంటే ఎక్కువ వయసు ఉండి, డయాబెటిస్‌‌, గుండె, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి డిసీజెస్‌‌తో బాధపడుతున్న వారిని సైతం ఇంటికే పరిమితం చేయాలి. వృద్ధులు, దీర్ఘకాలిక రోగుల వివరాలను సేకరించి, మ్యాపింగ్ చేయాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు వీళ్ల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి.

దూరం, మాస్కులు తప్పనిసరి: నిత్యావసరాలు, ఇతర షాపులు, మార్కెట్లు, పబ్లిక్ ప్లేసులు, గవర్నమెంట్, ప్రైవేటు ఆఫీసులు, హాస్పిటల్స్‌‌ సహా ప్రతి చోటా మనిషికి మనిషికి మధ్య 2 మీటర్ల ఫిజికల్ డిస్టెన్స్‌‌ తప్పనిసరిగా పాటించాలి. వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకూ ఇది కొనసాగాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా కఠిన చర్యలు తీసుకోవాలి.

50% స్టాఫ్​తోనే ఆఫీసులు నడపాలి: గవర్నమెంట్ ఆఫీసులు, బ్యాంకులను 50 శాతం స్టాఫ్‌‌తోనే నడిపించాలి. ప్రైవేటు ఆఫీసుల్లో షిఫ్ట్‌‌కు 70 శాతం ఉద్యోగులనే అనుమతించాలి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సంఖ్యను 50 నుంచి 20 శాతానికి తగ్గించాలి. ఆఫీసుల్లో హ్యాండ్ వాష్​ సౌకర్యం, శానిటైజర్స్‌‌ అందుబాటులో ఉంచాలి. ఈ నిబంధన పాటించకపోతే సంస్థ యజమానిపై డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ యాక్ట్‌‌ కింద చర్యలు తీసుకోవాలి.

2 నెలలు వినోదాలు బంద్‌‌: షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూట్స్‌‌, గుడులు, పార్కులు, రెస్టారెంట్లు, ఎగ్జిబిషన్లు, స్పోర్ట్స్‌‌ సహా జనాలు గుమిగూడే స్థలాలు, ఈవెంట్లు మరో 60 రోజుల వరకూ బంద్‌‌ పెట్టాలి. వైరస్ ముప్పు తొలగిపోయే వరకూ బంద్‌‌ కొనసాగించాలి. పెండ్లిళ్లకు, చావులకు 20  మందిని మాత్రమే అనుమతించాలి.

జిల్లాలకు గ్రేడింగ్‌‌: వైరస్ వ్యాప్తి, కేసుల సంఖ్య, బాధితులకు ట్రీట్‌‌మెంట్ అందించేందుకున్న వైద్య సదుపాయాలను బట్టి జిల్లాలను 4 గ్రేడ్లుగా విభజించాలి. గ్రేడ్1 జిల్లాల్లో 30 రోజులు, గ్రేడ్‌‌ 2 జిల్లాల్లో 40, గ్రేడ్‌‌ 3 జిల్లాల్లో 50, గ్రేడ్ 4 జిల్లాల్లో 60 రోజుల పాటు అన్ని నిబంధనలూ కఠినంగా అమలు చేయాలి.