
- 23 ఇన్‌స్టిట్యూషన్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్
- బ్యూరోక్రాట్స్ ఓట్లతోనే జగన్‌మోహన్ రావు గెలిచాడన్న టీసీఏ
- ఓటర్ల లిస్టును సేకరించిన సీఐడీ.. పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల గుర్తింపు
- త్వరలో నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం
- నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ.. మరో 5 రోజులు కోరనున్న సీఐడీ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ కేసులో తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రావు గెలిచేందుకు పలువురు సివిల్ సర్వెంట్లు కూడా కారణమని సీఐడీ అధారాలు సేకరించింది. 23 ఇన్‌స్టిట్యూషన్ల నుంచి వీరంతా ఓట్లు వేసినట్లు గుర్తించింది. అయితే, వీరికి హెచ్‌సీఏలో ఓటు హక్కు ఉందా? ఎలాంటి అర్హతలతో ఓట్లు వేశారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నది. ఫోర్జరీ సంతకాలు, డాక్యుమెంట్లతో అధ్యక్షుడిగా ఎన్నికైన కేసులో జగన్‌మెహన్‌రావు, హెచ్‌సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంటె శ్రీచక్ర, క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, సెక్రటరీ రాజేందర్ యాదవ్‌ను ఈ నెల 9న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కోర్టు అనుమతితో గురువారం నుంచి ఆరు రోజుల పాటు సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు. కస్టడీ ముగియడంతో మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నారు. మరింత కీలక సమాచారం సేకరించాల్సిన నేపథ్యంలో మరో 5 రోజులపాటు కస్టడీకి అనుమతివ్వాలని కోరనున్నట్లు తెలిసింది.
బ్యూరోక్రాట్ల ఓట్లతోనే గెలుపు: టీసీఏ
జగన్‌మోహన్ రావు సహా ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంటె విచారణలో సీఐడీ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. కస్టడీలో ఉన్న ఈ ముగ్గురిని సీఐడీ అధికారులు ఉప్పల్ స్టేడియంలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, హెచ్‌సీఏ ప్రధాన కార్యాలయంలో 3 రోజుల పాటు విచారించారు. క్రికెట్ క్లబ్స్ లేదా ఇన్‌స్టిట్యూషన్ తరఫున ఎవరెవరు ఓటు వేయాలనే వివరాలతో జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు ఇచ్చిన లిస్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆ లిస్ట్‌లో ఉన్న వారు మాత్రమే హెచ్‌సీఏ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉంటారని సమాచారం.
అయితే లావు నాగేశ్వర్‌రావు ఇచ్చిన లిస్టులో లేని వారు కూడా ఓట్లు వేశారని తెలంగాణ క్రికెట్‌అసోసియేషన్ (టీసీఏ) ఇప్పటికే సీఐడీకి ఆధారాలు అందించినట్లు తెలిసింది. హెచ్‌సీఏకు 47 ఇన్స్టిట్యూషన్లు ఉండగా.. 23 ఇన్‌స్టిట్యూషన్ల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓట్లు వేశారని టీసీఏ ఆరోపిస్తున్నది. ఐపీఎస్, ఐఏఎస్‌లు ఓట్లు వేయడం వల్లే జగన్‌మోహన్‌రావుకు 63 ఓట్లు పడ్డాయని తెలిపింది. ఐఏఎస్, ఐపీఎస్‌లు ఓట్లు వేయడం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధమని టీసీఏ చెబుతున్నది. గత ప్రభుత్వం ఒత్తిడితోనే బ్యూరోక్రాట్స్ ఓట్లు వేశారని తెలిపింది. ఈ క్రమంలోనే హెచ్‌సీఏ ఓటర్ల లిస్ట్ ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేస్తున్నది.
ఫోర్జరీ డాక్యుమెంట్లు, నిధుల గోల్‌మాల్ రికార్డులు స్వాధీనం
తెలంగాణ క్రికెట్‌అసోసియేషన్, గౌలిపుర క్రికెట్ క్లబ్ సహా హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికకు గల మాన్యువల్, బీసీసీఐ విధివిధానాలకు సంబంధించిన రికార్డులను సీఐడీ అధికారులు సేకరించారు. ప్రధానంగా ఫోర్జరీ సంతకాలు, ఇతర డాక్యుమెంట్లతో జగన్‌మోహన్‌రావు ఎన్నికకు సంబంధించిన పూర్తి వివరాలతో నిందితులుసహా ఆఫీస్ బేరర్లు, వివిధ క్రికెట్‌అసోసియేషన్ల అధ్యక్షులు, సభ్యులు ఇతరుల స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. ఇందులో భాగంగా హెచ్‌సీఏ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైన వారితో పాటు ఓటు హక్కు కలిగి ఉన్న వారి వివరాలను సేకరించారు. జగన్‌మోహన్‌రావు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగం సహా ఐపీఎల్ టికెట్ల విక్రయాలు, క్యాటిరింగ్ కాంట్రాక్టుల గురించి సీఐడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది.
సీఐడీ దర్యాప్తు వివరాలు..
- తెలంగాణ క్రికెట్‌అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దరమ గురువారెడ్డి ఫిర్యాదు మేరకు ఐపీసీ 465, 468, 471, 403, 409, 420, 341, 506 సెక్షన్ల కింద జూన్9న సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు.
- ప్రధాన నిందితుడిగా హెచ్‌సీఏ అధ్యక్షుడు ఏ జగన్‌మోహన్‌రావు , రెండో నిందితుడిగా సెక్రటరీ దేవరాజ్‌రామచందర్, ఏ3గా ట్రెజరర్ చౌటి జగన్నాథ్ శ్రీనివాస రావు, ఏ4 గా సీఈవో సునీల్ కాంటె, ఏ5గా శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌జనరల్ సెక్రటరీ సీ రాజేందర్ యాదవ్, ఏ6 గా శ్రీచక్ర క్రికెట్‌క్లబ్ అధ్యక్షురాలు రాజేందర్ యాదవ్ భార్య కవితను నిందితులుగా చేర్చిన సీఐడీ.
- ఈ నెల 9న జగన్‌మోహన్ రావు సహా ఐదుగురు నిందితులు అరెస్ట్..10న రిమాండ్. సెక్రటరీ దేవరాజ్‌రామచందర్ పరారీ.. గాలిస్తున్న సీఐడీ అధికారులు. దేవరాజ్‌కు సమాచారం ఇచ్చాడని ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిపై బదిలీ వేటు.
- మాజీ మంత్రి కృష్ణయాదవ్ అధ్యక్షుడిగా ఉన్న గౌలిపుర క్రికెట్‌క్లబ్‌పేరును శ్రీచక్ర క్రికెట్‌క్లబ్‌గా పేర్కొంటూ కృష్ణయాదవ్ సంతకాలు ఫోర్జరీ చేసి హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీకి జగన్‌మోహన్ రావు ఎంట్రీ.
- మాజీ మంత్రి కేటీఆర్, కవిత ప్రోత్సాహంతోనే జగన్‌మోహన్‌రావు అక్రమంగా ఎన్నికయ్యాడని తెలంగాణ క్రికెట్‌అసోసియేషన్ ఆరోపణ. పదేండ్లలో గ్రాంట్లుగా వచ్చిన బీసీసీఐ నిధుల్లో రూ.100 కోట్లు దారి మళ్లించినట్లు సీఐడీ, ఈడీకి ఫిర్యాదులు.
- కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఈ వెంట్స్ నౌ ద్వారా టికెట్ల విక్రయాలు, క్యాటరింగ్, ప్లేయర్ల ట్రావెలింగ్, హోటల్స్ ఏర్పాట్లలో నిధులు గోల్‌మాల్ అయ్యాయని టీసీఏ ఆరోపణలు.
- బీసీసీఐ నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేపట్టిన ఈడీ.. సీఐడీ నుంచి ఎఫ్ఐఆర్ సహా రికార్డులు సేకరణ.. త్వరలోనే నిందితులను కస్టడీకి తీసుకోనున్న ఈడీ.
- నిందితుల ఆరు రోజుల కస్టడీ విచారణలో హెచ్‌సీఏ అధ్యక్షుడి ఎన్నికల్లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఓట్లు వేశారని గుర్తింపు. వారికి నోటీసులు ఇచ్చి విచారించనున్న సీఐడీ