
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఇన్‌చార్జి ఈవోగా ఐఏఎస్ అధికారి రవినాయక్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రవినాయక్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత ఆలయ ఈవో వెంకటరావు వ్యక్తిగత పనుల నిమిత్తం నెల రోజుల పాటు సెలవు పెట్టారు. గతంలో రవినాయక్ యాదాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేశారు.
యాదగిరిగుట్టకు వచ్చిన రవినాయక్ కు తహశీల్దార్ గణేశ్ నాయక్ పూల బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం ఈవో క్యాంప్ కార్యాలయంలో అర్చకుల వేదాశీర్వచనం అనంతరం ఈవోగా సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రవినాయక్ మాట్లాడుతూ.. స్వామివారితో పాటు దర్శనానికి వచ్చే భక్తులకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.