
జనానికి ఇబ్బంది కలగనీయం
ప్రైవేటు బస్సులు, స్కూలు బస్సులు సిద్ధం చేశాం
3వేల మంది డ్రైవర్లను తీసుకుంటాం
ఐఏఎస్ త్రిసభ్య కమిటీ కామెంట్స్
ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సిద్ధం కావడంతో… ప్రభుత్వం ఆల్టర్ నేట్ ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. గత మూడు రోజులుగా ఆర్టీసీ జేఏసీతో చర్చించామని… కొద్దిగా టైమ్ ఇవ్వండని అడిగినా కూడా వాళ్లనుంచి సరైన స్పందన రాలేదని IAS అధికారుల కమిటీ చైర్మన్ సోమేశ్ కుమార్ చెప్పారు. జేఏసీ వాళ్లు హామీలను రాతపూర్వకంగా ఇవ్వాలని అడిగారని చెప్పారు. తెలంగాణలో దసరా పండగ పెద్ద పండగ కాబట్టి.. సమ్మెను నివారించేందుకు మూడు దఫాలుగా చర్చలు జరిపామని చెప్పారు. ఆర్టీసీ సమస్యలపై త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామన్నారు సోమేశ్ కుమార్.
ఎస్మా ప్రయోగిస్తాం.. డిస్మిస్ చేస్తాం..
“కార్మిక, ట్రాన్స్ పోర్ట్ డిపార్టుమెంట్ రూల్స్ ప్రకారం సమ్మె ఇల్లీగల్. సమ్మె చేస్తే ప్రత్యామ్నాయాలతో రెడీగా ఉన్నాం 2100 అద్దె బస్సులు అందుబాటులో ఉంచుతాం. 20వేలకు పైగా స్కూల్ బస్సులు ఉన్నాయి. అవసరమైతే వాటినీ నడుపుతాం. పోలీస్ ప్రొటెక్షన్ తో బస్సులు నడిపించడానికి రెడీగా ఉన్నాం. 3వేల మంది డ్రైవర్స్ ను నియమిస్తాం. ట్రాన్స్ పోర్ట్, ఆర్టీసీ అధికారుల కోఆర్డినేషన్ తో బస్సులు నడుపుతాం. ప్రజలకు ఇబ్బంది కలుగవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నాం. Ola ,ఉబర్, మెట్రోతో మాట్లాడాం. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తాం” ” అని చెప్పారు IAS సునీల్ శర్మ.
సమ్మెలో పాల్గొనే ఆర్టీసీ ఉద్యోగులకు హెచ్చరికలు చేశారు త్రిసభ్య కమిటీ ఐఏఎస్ అధికారులు. “సమ్మెపై నిషేధం ఉంది. సమ్మెకు పోవడం ఇల్లీగల్. అవసరమైతే ఎస్మా ప్రయోగిస్తాం. డిస్మిస్ చేయడానికి కూడా వెనుకాడం. డిస్మిస్ అయిన వాళ్ళను తీసుకోవడం కష్టమే” అని అన్నారు.
డ్యూటీ చేసేందుకు రావాలనుకునేవాళ్లు రావొచ్చు
ఆర్టీసీపై ప్రభుత్వానికి కమిట్ మెంట్ ఉందని.. కమిటీ సభ్యుడు, ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.1,695 కోట్ల సహకారం అందించారని గుర్తుచేశారు. “తెలంగాణ వచ్చాక రూ.3వేల 303 కోట్లు ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బడ్జెట్ లో కేటాయించిన దానికంటే ఆర్టీసీకి ఎక్కువే ఇచ్చాం. గత రెండు సంవత్సరాలుగా మాత్రమే కొంత తక్కువ ఇచ్చాం. ఇలాంటి సమ్మె వల్ల ప్రజల్లో సంస్థపై నమ్మకం పోతుంది. డ్యూటీ చేసేందుకు రావలనుకునే వాళ్ళు రావొచ్చు” అని రామకృష్ణారావు చెప్పారు.