- త్వరలో కేంద్ర సైబర్ సెక్యూరిటీ కూడా రంగంలోకి
బషీర్‌బాగ్, వెలుగు: మూవీ పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ సూత్రధారి ఇమ్మడి రవి కస్టడీ విచారణ నాలుగో రోజు ముగిసింది. విచారణలో రవి సహకరించకపోవడంతో దర్యాప్తు అధికారులు మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా విచారణను పర్యవేక్షించారు.
విదేశాల్లో ఉన్న సర్వర్లకు భారతదేశం నుంచే యాక్సెస్ ఇస్తున్నారని ప్రాథమిక దర్యాప్తులో రవి తెలిపినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థల ఫిర్యాదులతో కేసు వేగం పెరిగి, కేంద్ర ఏజెన్సీల దృష్టి కూడా పైరసీ మాఫియాపై కేంద్రీకృతమైంది. యూట్యూబ్, డొమైన్ హోస్టింగ్ కంపెనీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
రాష్ట్ర సైబర్ క్రైం శాఖ కీలక ఆధారాలను సేకరించేందుకు డిజిటల్ ఫోరెన్సిక్ టీమ్‌ను రంగంలోకి దించింది. సినిమాలను అప్‌లోడ్ చేసే టీంను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. అడ్వర్టైజ్‌మెంట్ రెవెన్యూ ఎవరికి వెళ్తోందనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మాల్ వేర్ సైట్లతో లింకులు ఉన్నాయా అనే కోణంలోనూ రవిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 355 పైరసీ వెబ్‌సైట్లపై కంట్రోల్ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనిపై లోతైన విచారణ అవసరమవుతుందని కేంద్ర సైబర్ సెక్యూరిటీ శాఖ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. నాలుగో రోజు విచారణలో పలు కీలక విషయాలను సైబర్ క్రైం పోలీసులు రాబట్టినట్లు సమాచారం.
