విదేశాలకు వెళ్లే స్టూడెంట్లకు కాన్వొకేషన్‌‌కు ముందే పట్టాలు

విదేశాలకు వెళ్లే స్టూడెంట్లకు కాన్వొకేషన్‌‌కు ముందే పట్టాలు
  • అగ్రికల్చర్‌‌  పీజీ, పీహెచ్‌‌డీ సీట్లలో ఐసీఏఆర్‌‌ కోటా పెరిగింది
  • 5 శాతం పెంపునకు గ్రీన్‌‌ సిగ్నల్‌‌
  • విదేశాలకు వెళ్లే స్టూడెంట్లకు కాన్వొకేషన్‌‌కు ముందే పట్టాలు
  • మిగిలిన డిప్లొమా సీట్లను స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ 
  • 17వ అకాడమిక్ కౌన్సిల్​లో 16 అంశాలకు ఆమోదం

హైదరాబాద్‌‌, వెలుగు: అగ్రికల్చర్‌‌ వర్సిటీ  పరిధిలోని పీజీ, పీహెచ్‌‌డీ సీట్లలో ఐసీఏఆర్‌‌ కోటాను 25 నుంచి 30 శాతానికి పెంచడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. శనివారం రాజేంద్రనగర్ లోని యూనివర్సిటీ ఆడిటోరియంలో 17వ అకాడమిక్ కౌన్సిల్ సమావేశం జరిగింది. వర్సిటీ ఇన్ చార్జ్ వీసీ, అగ్రికల్చర్‌‌ సెక్రటరీ రఘునందన్ రావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో రిజిస్ట్రార్  ప్రొఫెసర్ ఎస్.సుధీర్ కుమార్, వివిధ విభాగాల డీన్లు, అకడమిక్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల అగ్రికల్చర్‌‌ యూనివర్సిటీల వీసీల  సమావేశంలో నిర్ణయించిన విధంగా ఐసీఏఆర్‌‌ కోటాను 2022-–23 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయడానికి ఆమోదం తెలిపారు. యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి 16 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు.

యూజీ కోర్సు ఫైనలియర్‌‌ విద్యార్థులు హయ్యర్‌‌ స్టడీస్‌‌ ను ఏటా మే నెలలోగా కోర్సు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ నిర్ణయించింది. అలాగే యూజీ సీట్లలో ఐసీఏఆర్‌‌  కోటాని 15 నుంచి 20 శాతానికి పెంచడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అయినా భర్తీ కాకుండా  మిగిలిపోయిన డిప్లొమా సీట్లను స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసుకోవడానికి ప్రైవేట్ పాలిటెక్నిక్  కాలేజీలకు అనుమతి ఇవ్వడానికి కూడా కౌన్సిల్ అంగీకరించింది. టీఎస్‌‌ పాలిసెట్ లో అర్హత పొందిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కౌన్సిల్ స్పష్టం చేసింది. విదేశాల్లో చదువుకునే వారికి ఇబ్బంది లేకుండా కాన్వొకేషన్ ముందే ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్ లు ఇవ్వడానికీ  కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 

అగ్రిసెట్ ఫలితాల విడుదల

అగ్రిసెట్- 2022 ఫలితాలను వర్సిటీ వీసీ రఘునందన్ రావు విడుదల చేశారు.  ఫలితాలను వర్సిటీ వెబ్‌‌సైట్‌‌లో అందుబాటులో ఉంచుతామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. పరీక్ష రాసిన విద్యార్థులు రెస్పాన్స్ షీట్ ను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే వీలు కల్పించారు. ఈ ఫలితాల  విడుదల కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్,  అగ్రిసెట్ - 2022 కన్వీనర్ డాక్టర్  మల్లారెడ్డి పాల్గొన్నారు.