అహ్మదాబాద్: మసక వెలుతురు (బ్యాడ్ లైట్) కారణంగా టెస్ట్ మ్యాచ్‌లు నిలిచిపోకుండా ఉండేందుకు ప్రయోగాత్మకంగా 'పింక్ బాల్' ఉపయోగించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆమోదం తెలిపింది. అహ్మదాబాద్‌లో జరిగిన రెండు రోజుల వార్షిక సమావేశంలో క్రికెట్ నిబంధనల్లో పలు కీలక మార్పులను ప్రవేశపెట్టారు. ఈ కొత్త నిబంధన ప్రకారం.. మ్యాచ్ ఎరుపు రంగు బంతితోనే ప్రారంభమవుతుంది. ఒకవేళ వెలుతురు తగ్గినప్పుడు, ఇరు జట్లు సిరీస్ ప్రారంభానికి ముందే అంగీకరిస్తే.. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్ బాల్ ఉపయోగించి మిగిలిన ఓవర్లను పూర్తి చేస్తారు.
ఐసీసీ ఆమోదించిన ఇతర ముఖ్య నిర్ణయాలు
టీ20ల తరహాలోనే ఇకపై టెస్ట్ మ్యాచ్‌లలోనూ షెడ్యూల్ ప్రకారం జరిగే డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్‌లు మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో వ్యూహాలు చర్చించవచ్చు. బౌలర్ల శైలిని అదుపు చేయడానికి ఆన్-ఫీల్డ్ అంపైర్లకు 'హాక్-ఐ' డేటాను పరిశీలించే సదుపాయాన్ని కల్పించారు. నిబంధనల ఉల్లంఘన, అవినీతి ఆరోపణల నేపథ్యంలో క్రికెట్ కెనడా సభ్యత్వాన్ని ఐసీసీ తక్షణమే రద్దు చేసింది. అయితే ఆటగాళ్ల ప్రయోజనాలకు కెనడా జాతీయ జట్టు ఐసీసీ ఈవెంట్లలో ఆడేందుకు అనుమతించింది. ఈ కొత్త నిబంధనలన్నీ 2026 అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.మహిళల క్రికెట్ మహిళల చాంపియన్స్ ట్రోఫీ 2027 షెడ్యూల్‌ను జూన్, జులై నుంచి 2027 ఫిబ్రవరికి మారుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. 2026లో ఐదు పుల్ మెంబర్స్, ఐదు అసోసియేట్ మెంబర్స్ జట్లతో కలిపి మొత్తం 10 జట్లతో మహిళల ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీని పైలట్ ప్రాజెక్ట్‌గా
నిర్వహించనున్నారు.
