ఐసీసీ కీలక నిర్ణయం .. డబ్ల్యూటీసీ విన్నర్‌‌కు రూ. 30 కోట్లు

ఐసీసీ కీలక నిర్ణయం .. డబ్ల్యూటీసీ విన్నర్‌‌కు రూ. 30 కోట్లు

దుబాయ్‌‌: టెస్టు క్రికెట్‌‌కు ప్రాధాన్యత పెంచేందుకు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వరల్డ్‌‌ టెస్టు చాంపియన్‌‌షిప్‌‌ (డబ్ల్యూటీసీ) ప్రైజ్‌‌ మనీని భారీగా పెంచింది. దీంతో జూన్‌‌ 11 నుంచి లార్డ్స్‌‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్‌‌లో విజేతగా నిలిచే జట్టు రూ. 30.78 కోట్ల నగదు బహుమతిని అందుకోనుంది. రన్నరప్‌‌ జట్టుకు రూ. 18.46 కోట్లు ఇవ్వనున్నట్లు ఐసీసీ గురువారం వెల్లడించింది. 2023లో విన్నర్‌‌గా నిలిచిన ఆసీస్‌‌కు రూ. 13.67 కోట్ల ప్రైజ్‌‌ మనీ లభించింది. 2023–25 డబ్ల్యూటీసీ సైకిల్‌‌ మొత్తం ప్రైజ్‌‌మనీ 49.27 కోట్లుగా ఉంది. 

మూడో స్థానంలో ఉన్న ఇండియాకు రూ. 12.31 కోట్లు దక్కనున్నాయి. ‘డబ్ల్యూటీసీ సైకిల్‌‌కు మరింత ఆదరణ పెంచే ఉద్దేశంతో ప్రైజ్‌‌మనీని పెంచాం. రాబోయే రోజుల్లో టెస్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం’ అని ఐసీసీ పేర్కొంది. ఇక వరల్డ్‌‌ టెస్టు చాంపియన్‌‌షిప్‌‌ను కాపాడుకునేందుకు తాము మరింత శ్రమిస్తామని ఆసీస్‌‌ కెప్టెన్‌‌ ప్యాట్‌‌ కమిన్స్‌‌ అన్నాడు. గత రెండేళ్లుగా ఫైనల్‌‌ చేరడానికి చాలా కష్టపడ్డామన్నాడు. టెస్టు క్రికెట్‌‌ ప్రాధాన్యతను అర్థం చేసుకునేందుకు ఐసీసీ తీసుకున్న కీలక నిర్ణయం ఉపయోగపడుతుందని సౌతాఫ్రికా కెప్టెన్‌‌ టెంబా బవుమా వ్యాఖ్యానించాడు. మెగా మ్యాచ్‌‌కు లార్డ్స్‌‌ సరైన వేదిక అని భావిస్తున్న తాము అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు  ప్రయత్నిస్తామన్నాడు.