న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో భారీ మార్పులు తీసుకొచ్చేందుకు ఐసీసీ రెడీ అవుతోంది. టెస్ట్ క్రికెట్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు, టీ20లను మరింత వేగంగా ముగించేందుకు కొన్ని విప్లవాత్మక మార్పులు చేయనున్నట్లు సమాచారం. టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో వాతావరణం అనుకూలించక వెలుతురు తగ్గితే ఆటను కొనసాగించడానికి రెడ్ బాల్ స్థానంలో పింక్ బాల్‌ను ఉపయోగించాలనే సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు.
ఈ నెల 21న వర్చువల్‌గా జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. గ్రౌండ్‌లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆటను కొనసాగించాల్సి వచ్చినప్పుడు మాత్రమే బంతిని మార్చేందుకు అవకాశం ఉంటుంది.
దీనికి ఇరుజట్ల కెప్టెన్లు అంగీకరించాలి. డీఆర్‌ఎస్ మాదిరిగానే సిరీస్ ప్రారంభానికి ముందే ఇరుజట్లు ఈ రూల్‌కు సమ్మతి తెలపాల్సి ఉంటుంది. బౌలర్ల విభిన్న శైలి వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో రూల్స్‌ను మరింత కఠినతరం చేయాలని ఐసీసీ భావిస్తోంది. బౌలర్లు నిబంధనలకు విరుద్ధంగా బంతిని విసురుతున్నారా (చకింగ్) లేదా అనేది మ్యాచ్ జరుగుతుండగానే గుర్తించేందుకు 'హాక్‌ఐ' సాంకేతికతను ఉపయోగించాలని ప్రతిపాదించారు.
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పునర్నిర్మాణంతో పాటు, ఈ కొత్త ప్రతిపాదనలపై ఈ నెల 30, 31వ తేదీల్లో అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా జరగనున్న ఐసీసీ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
