‘రెడ్‌ లిస్ట్‌’లో ఇండియా.. అయినా షెడ్యూల్‌ ప్రకారమే ఫైనలంటున్న ఐసీసీ

‘రెడ్‌ లిస్ట్‌’లో ఇండియా.. అయినా షెడ్యూల్‌ ప్రకారమే ఫైనలంటున్న ఐసీసీ
  • షెడ్యూల్‌ ప్రకారమే డబ్ల్యూటీసీ ఫైనల్‌: ఐసీసీ
  • యూకే ట్రావెల్‌ ‘రెడ్‌ లిస్ట్‌’లో ఇండియా

దుబాయ్‌‌‌‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంగ్లండ్‌‌లో రిస్ట్రిక్షన్స్‌‌ పెరుగుతున్నప్పటికీ వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ (డబ్యూటీసీ) ఫైనల్‌‌ మ్యాచ్‌‌ షెడ్యూల్‌‌ ప్రకారమే జరుగుతుందని ఐసీసీ తేల్చిచెప్పింది. సౌతాంప్టన్‌‌ వేదికగా వచ్చే జూన్‌‌ 18న ఇండియా, న్యూజిలాండ్‌‌ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌‌ ప్రారంభం కానుంది. అయితే, కరోనా కేసులు పెరుగుతుండటంతో యూకే గవర్నమెంట్‌‌ ఇండియాను రెడ్‌‌ లిస్ట్‌‌లో చేర్చింది. ఇండియా నుంచి యూకే వచ్చే తమ దేశ పౌరులకు 10 రోజుల క్వారంటైన్‌‌ తప్పనిసరి చేసింది. ఇతరులు తమ దేశంలోకి రాకుండా బ్యాన్‌‌ పెట్టింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌‌పై సందేహాలు మొదలవ్వగా.. ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. ‘కరోనా వ్యాప్తి ముప్పు ఉన్నా క్రికెట్‌‌ను సేఫ్‌‌గా ఎలా నిర్వహించాలో ఇంగ్లండ్‌‌తోపాటు ఇతర సభ్య దేశాలు ఇప్పటికే చూపెట్టాయి  అందువల్ల డబ్ల్యూటీసీ ఫైనల్‌‌ విషయంలో మాకు నమ్మకముంది. షెడ్యూల్‌‌ ప్రకారం యూకే వేదికగా మ్యాచ్‌‌ జరుగుతుంది. రెడ్‌‌ లిస్ట్‌‌ అంశంపై యూకే గవర్నమెంట్‌‌తో చర్చలు మొదలుపెట్టాం’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా..డబ్ల్యూటీసీ ఫైనల్‌‌ గురించి ఇప్పుడేం మాట్లాడినా తొందరపాటు అవుతుందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి అన్నారు. ‘జూన్‌‌లో ఇండియా పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. అప్పటికి మన దేశం పేరు రెడ్‌‌ లిస్ట్‌‌ నుంచి తప్పిస్తారనే నమ్మకముంది. పది రోజులు క్వారంటైన్‌‌లో ఉండాల్సి వస్తే టీమ్‌‌ కచ్చితంగా ఉంటుంది’ అని బీసీసీఐ అధికారి చెప్పారు.