
- సెంచరీతో చెలరేగిన ఆజమ్
- సత్తా చాటిన షాహీన్, సోహైల్
సెమీస్ చేరాలంటే ప్రతీ మ్యాచ్ నెగ్గాల్సిన పరిస్థితిలో పాకిస్థాన్ పంజా విసురుతోంది. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన పాక్ ఈసారి న్యూజిలాండ్ జోరుకు చెక్ పెట్టింది. అన్ని విభాగాల్లోనూ అదరగొడుతూ కివీస్‌కు టోర్నీలో ఓటమి రుచి చూపించింది. యువ పేసర్ షాహీన్ షా అఫ్రీది (10–3–28–3) పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయగా.. బాబర్ ఆజమ్ ( 127 బంతుల్లో 11 ఫోర్లతో 101 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో చిన్న టార్గెట్‌ను ఈజీగా ఛేజ్ చేసిన సర్ఫరాజ్‌సేన టోర్నీలో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
బర్మింగ్‌హామ్: ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాకిస్థాన్ మరోసారి చెలరేగింది. ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో న్యూజిలాండ్ పని పట్టింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ రేసులో నిలిచింది. మొదట న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 237 రన్స్ చేసింది. జేమ్స్ నీషమ్ (112 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 నాటౌట్), కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (71 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 64) హాఫ్ సెంచరీతో సత్తా చాటారు. అనంతరం పాకిస్థాన్ 49.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేజ్ చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బాబర్‌తో పాటు హారిస్ సోహైల్ ( 76 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 ) హాఫ్ సెంచరీతో రాణించాడు.
బాబర్ ధనాధన్
కివీస్‌ను కట్టడి చేసిన పాకిస్థాన్ చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో తడబడింది. ఓపెర్లిద్దరూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. స్టార్ పేసర్ బౌల్ట్ మూడో ఓవర్లోనే ఫఖర్ జమాన్ (9)ను ఔట్ చేసి దెబ్బకొట్టగా.. ఇమాముల్ హక్ (19)ను ఫెర్గుసన్ పెవిలియన్ చేర్చడంతో 44/2తో నిలిచింది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన బాబర్ ఆజమ్ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. మహమ్మద్ హఫీజ్ (32)తో మూడో వికెట్‌కు 66 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఛేజింగ్ సాఫీగా సాగుతుండగా పార్ట్ టైమర్ విలియమ్సన్ బౌలింగ్‌లో అనవసర షాట్ ఆడిన హఫీజ్.. ఫెర్గుసన్‌కు క్యాచ్ ఇవ్వడంతో కివీస్ రేసులోకొచ్చింది. అయితే, బాబర్.. ప్రత్యర్థికి మరో చాన్సివ్వలేదు. 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను హారిస్ సోహైల్ సహకారంతో క్రమంగా టార్గెట్‌ను కరిగించాడు. విలియమ్సన్ బౌలింగ్‌లో రెండు బౌండ్రీలు కొట్టి వేగం పెంచగా.. మరో ఎండ్‌లో సోహైల్ కూడా జోరు పెంచాడు. శాంట్నర్, బౌల్ట్ ఓవర్లలో ఒక్కో సిక్సర్ బాదిన అతను 61 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బాబర్ కూడా పర్‌ఫెక్ట్ షాట్లతో వరుసగా బౌండ్రీలు కొడుతూ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టును గెలిపించాడు.
ఆదుకున్న నీషమ్, గ్రాండ్‌హోమ్
ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో గంటన్నర ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన కివీస్ కెప్టెన్ కేన్ బ్యాటింగ్ ఎంచుకొని అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఛేజింగ్‌లో పాక్ తడబడే అలవాటును దృష్టిలో ఉంచుకొని అతను తీసుకున్న ఈ నిర్ణయం తప్పని తేలడానికి ఎంతో టైమ్ పట్టలేదు. పిచ్‌పై తేమను సద్వినియోగం చేసుకున్న పాక్ పేసర్లు బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. సీనియర్ పేసర్ మహ్మద్ ఆమిర్ వేసిన తొలి బంతినే వికెట్ల మీదకు ఆడుకున్న ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (5)ను బౌల్డ్ అవడంతో పాక్‌కు అద్భుత ఆరంభం దక్కింది. ఆపై,19 ఏళ్ల లెఫ్టామ్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది వరుస ఓవర్లలో కొలిన్ మన్రో (12)తో పాటు వెటరన్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ (3)ను ఔట్ చేసి షాకిచ్చాడు. మన్రో స్లిప్‌లో హారిస్ సోహైల్‌కు చిక్కగా… పాక్ కెప్టెన్, కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ కుడివైపుకు డైవ్ చేస్తూ టేలర్ క్యాచ్ అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. షాహీన్ బౌలింగ్‌లోనే టామ్ లాథమ్ (1) సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇవ్వడంతో కివీస్ 46/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ విలియమ్సన్ (41), నీషమ్ ఐదో వికెట్‌కు 37 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ, 27వ ఓవర్లో లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ (1/43) లెంగ్త్ బాల్‌తో అతడిని బోల్తా కొట్టించడంతో 83/5తో నిలిచిన కివీస్ ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగదనిపించింది. కానీ, అప్పటికే క్రీజులో కుదురుకున్న నీషమ్, గ్రాండ్‌హోమ్‌తో కలిసి ఓర్పుగా బ్యాటింగ్ చేశాడు. ఎలాంటి పొరపాటుకు తావివ్వని ఈ ఇద్దరూ ఒక్కో పరుగు చేరుస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. చివర్లో ధాటిగా ఆడి ఆరో వికెట్‌కు 132 రన్స్ జోడించారు. 48వ ఓవర్లో గ్రాండ్‌హోమ్ రనౌటైనా.. కడదాకా క్రీజులో నిలిచిన నీషమ్ లాస్ట్ బాల్‌కు సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.