
వరంగల్: హన్మకొండ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ ఉత్సవాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కావ్య హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓరుగల్లు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తుంది. ఈ బతుకమ్మ సంబురంలో పాలుపంచుకునేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు.
రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగకు కేరాఫ్గా భావించే ఓరుగల్లు నుంచి మొదలయ్యే సంబురాలను ప్రభుత్వం తొమ్మిది రోజుల పాటు వివిధ జిల్లాల్లో నిర్వహించేలా కార్యాచరణ రూపొందించింది. ఆదివారం ఓరుగల్లులో మొదలైన బతుకమ్మ వేడుకలు ఈనెల 30న హైదరాబాద్ ట్యాంక్‍బండ్ వద్ద ముగియనున్నాయి.
ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ఏటా వెయ్యిస్తంభాల గుడిలో ప్రారంభం అవుతుండగా, ఏటేటా మహిళలతో పాటు కొత్తగా వచ్చే యువతులతో ఈ ప్రాంతమంతా కిక్కిరిసిపోతుంది. ఆలయంలో ప్రధాన గుడి, నంది విగ్రహం, కల్యాణ మంటపం, కోనేరులకే ఎక్కువ స్థలం ఆక్రమించింది. ప్రస్తుతం ఇదే స్థలంలో పెద్ద స్టేజీ వేసి వేడుకలకు ఏర్పాట్లు చేయడంతో బతుకమ్మ ఆట స్థలం మరింత తగ్గింది. గతంలో మహిళలు ఆడిపాడే ఏరియాల్లోకి పురుషులను వెళ్లకుండా పోలీసులు కట్టడి చేసేవారు.
బతుకమ్మ సంబురాలకు ఓరుగల్లు కేంద్రంగా ఉండగా, 1990 నుంచే వెయ్యిస్తంభాల గుడిలో నిర్వహించే వేడుకల కోసం ఏటా వస్తున్న మహిళలతో ఆలయ ఆవరణ కిక్కిరిసిపోతుంది. రుద్రేశ్వరదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, చండీ యాగం నిర్వహిస్తారు. 2006లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా వెయ్యిస్తంభాల గుడిని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయంలో బతుకమ్మ ఆటాడుకునేలా సౌకర్యాలు కల్పించాలన్న భక్తుల విన్నపానికి ఆయన సానుకూలంగా స్పందించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. నాటి నుంచి ప్రధానంగా జీడబ్ల్యూఎంసీ, ఇతర శాఖల సమన్వయంతో ఇక్కడ బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ ప్రారంభమైంది. ఆపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడినుంచే వేడుకలు ప్రారంభించే అనవాయితీ నడుస్తోంది.