OnePlus: వన్ప్లస్ సీఈవోపై తైవాన్ అరెస్ట్ వారెంట్.. అంత పెద్ద కుట్ర చేశాడా..?

OnePlus: వన్ప్లస్ సీఈవోపై తైవాన్ అరెస్ట్ వారెంట్.. అంత పెద్ద కుట్ర చేశాడా..?

చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరిన వేళ.. తైవాన్  తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అందరికీ సుపరిచితమైన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ (OnePlus) సీఈవోపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది తైవాన్. చైనీస్ టెక్ కంపీనీ సీఈవోకు అరెస్ట్ వారెంట్ ఇవ్వడం హాట్ టాపిగ్ గా మారింది. టెక్నాలజీ లీక్ చేయడం, లోకల్ ట్యాలెంట్ ను నిబంధనలకు విరుద్ధంగా వాడుకోవడంపై ఆగ్రహించిన తైవాన్.. వన్ ప్లస్ CEO పీట్ లా పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. 

పీట్ లా ఆధ్వర్యంలో గత పదేళ్లలో 70 మంది ఇంజినీర్లను  అక్రమంగా నియమించుకున్నారని.. షిలిన్ జిల్లా ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ నుంచి వారెంట్ జారీ అయ్యింది. తైవాన్ క్రాస్ - స్ట్రైట్ యాక్ట్ ప్రకారం.. పీట్ లాను అరెస్టు చేయాల్సిందిగా వారెంట్ లో పేర్కొన్నారు. లా తైవాన్ లో చైనా వ్యాపార విధానంపై ఉన్న నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు.

వన్ ప్లస్ చేసిన పొరపాటేంటి..?

ప్రాసిక్యూటర్స్ ప్రకారం... వన్ ప్లస్ హాంగ్ కాంగ్ లో షెల్ కంపెనీ స్థాపించింది. ఆ తర్వాత 2015లో తైవాన్ లో ప్రభుత్వ అనుమతి లేకుండానే బ్రాంచ్ ఓపెన్ చేసింది.  చట్ట ప్రకారం.. చైనా కంపెనీ ఏదైనా తైవానీస్ లోకల్ ట్యాలెంట్ ను విగియోగించుకోవాలంటే.. ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ విషయంలో వన్ ప్లస్ నిబంధనలకు విరుద్ధంగా ఇంజినీర్లను నియమించుకుంది. స్థానిక ఇంజినీర్లను వినియోగించుకుని తమ టెక్నాలజీని కాపీ కొట్టే ప్రయత్నం చేసినట్లు తైవాన్ ఆరోపిస్తోంది. 

తైవాన్ చిప్ టెక్నాలజీపై చైనా కన్ను.. 

తైవాన్ ఇంతలా రియాక్ట్ కావడానికి కారణం.. చిప్ టెక్నాలజీపై చైనా కన్నేయడమే. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత చిప్ సెమీకండక్టర్ ప్రొడక్టివిటీ, టెక్నాలజీ తైవాన్ కు ఉంది. అమెరికా నుంచి దాదాపు అన్ని కంపెనీలు చిప్స్ కోసం తైవాన్ పైన ఆధారపడక తప్పని పరిస్థితి. వన్ ప్లస్ లాంటి కంపెనీలు స్థానిక నిబంధనలు ఉల్లంఘించి 70 మంది ఇంజినీర్స్ ను నియమించుకోవడంపై తైవాన్ సీరియస్ గా ఉంది. స్థానిక ఇంజినీర్స్ ను అక్రమంగా నియమించుకుని.. తమ టెక్నాలజీని కాపీ కొట్టాలని చైనా చూస్తోందని ఆగ్రహంతో ఉంది. 


2025 ఆగస్టులో 16 చైనా కంపెనీలపై విచారణ చేపట్టింది తైవాన్. ఆపిల్ కంపెనీకి సప్లై చేసే  గ్రేస్ వాంగ్ (Grace Wang) అనే కంపెనీకి ఆ సమయంలో ఇలాంటి వారెంటే ఇచ్చింది. లేటెస్టుగా వన్ ప్లస్ సీఈవోకు కూడా వారెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ అంశంపై వన్ ప్లస్ స్పందించింది. బిజినెస్ ఎప్పటిలాగే కొనసాగుందని కంపెనీ ప్రకటించింది. అయితే వారెంట్ పై పీట్ లా మాత్రం ఇప్పటికీ స్పందించలేదు. 

ఒకవైపు తైవాన్ తమదేనని చైనా ప్రకటిస్తూ.. చుట్టూ సైనిక విన్యాసాలు చేస్తూ పోతోంది. ఈ పరిస్థితుల్లో తైవాన్ కూడా ఆయుధాల బూజు దులుపుతోంది. తైవాన్ కు మద్ధతుగా జపాన్, అమెరికా ఆయుధ సహాయం అందించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిణామంలో తైవాన్ చైనా టెక్ కంపెనీ వన్ ప్లస్ సీఈవోకు వారెంట్ జారీ చేయడం ఉద్రక్త పరిస్థితులకు దారి తీసిందనే చెప్పాలి.