AA23: బాక్సాఫీస్ వద్ద పూనకాలే: అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్.. అనిరుధ్ మ్యూజిక్ ఫిక్స్!

AA23: బాక్సాఫీస్ వద్ద పూనకాలే: అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్.. అనిరుధ్ మ్యూజిక్ ఫిక్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఒక భారీ చిత్రం రాబోతుందంటూ.. గత కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఈ రోజు ( జనవరి 14, 2026 ) చిత్ర యూనిట్ కీలక అప్డేట్ అందించింది. భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ క్రేజీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.

మైత్రీ మూవీ మేకర్స్ హ్యాట్రిక్ మ్యాజిక్

‘పుష్ప’ చిత్రంతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తం చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ చిత్రంగా అట్లీ సినిమా ఉండగా,.. ఇది AA23గా పట్టాలెక్కనుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించేందుకు నిర్మాతలు ఎక్కడా వెనకాడటం లేదని విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రధాన ఆకర్షణ అనిరుధ్ రవిచందర్. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్న అనిరుధ్, లోకేష్-బన్నీ సినిమాకు సంగీతం అందించడం అంటే థియేటర్లలో సౌండ్ బాక్సులు బద్దలవ్వడం ఖాయం. లోకేష్ తన సినిమాల్లో ఇచ్చే 'ఎలివేషన్స్'కు, బన్నీ 'డ్యాన్స్, స్వైగ్' తోడైతే వెండితెరపై పూనకాలే అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

LCUలో భాగమేనా?

ప్రస్తుతం సినీ సర్కిల్స్ లో నడుస్తున్న హాట్ టాపిక్ ఏంటంటే.. ఈ సినిమా లోకేష్ సృష్టించిన LCU (Lokesh Cinematic Universe) లో భాగమవుతుందా లేదా? అనేది. విక్రమ్, ఖైదీ, లియో చిత్రాల తరహాలోనే బన్నీ క్యారెక్టర్ కూడా ఆ యూనివర్స్‌లో ఉంటే మాత్రం, అది ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్రాస్ ఓవర్ అవుతుంది. అయితే, దీనిపై చిత్ర యూనిట్ ఇంకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది.

భారీ పారితోషికం ..

ఈ సినిమా కోసం లోకేష్ కనగరాజ్ దాదాపు రూ. 75 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నట్లు సమాచారం. ఇది ఒక దర్శకుడికి లభిస్తున్న రికార్డు స్థాయి రెమ్యునరేషన్. ఇక అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకోనున్నారట. ఇందులో బన్నీ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ అండర్ వరల్డ్ లేదా హై-వోల్టేజ్ యాక్షన్ రోల్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.  ప్రస్తుతం అల్లు అర్జున్ తన 22వ ప్రాజెక్ట్‌ను అట్లీ దర్శకత్వంలో పూర్తి చేయనున్నారు. అది ముగిసిన వెంటనే, 2026 రెండో అర్ధభాగంలో లోకేష్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. అల్లు అర్జున్ స్టైల్, లోకేష్ టేకింగ్ కలిస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని సినీ విశ్లేషకులు, అభిమానులు భావిస్తున్నారు.