నాగార్జున సాగర్లో విషాదం.. హైదరాబాద్ జీడిమెట్ల నుంచి ప్రాజెక్ట్ చూడటానికి పోయి..

నాగార్జున సాగర్లో విషాదం.. హైదరాబాద్ జీడిమెట్ల నుంచి ప్రాజెక్ట్ చూడటానికి పోయి..

నల్లగొండ జిల్లా: వీకెండ్ కావడంతో నాగార్జున సాగర్ రిజర్వాయర్ చూడటానికి రాంబాబు అనే వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి సాగర్కు వెళ్లాడు. నదిలోకి దిగి దురదృష్టవశాత్తూ వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. శివాలయం పుష్కర ఘాట్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది.

హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన దిరిసిర్ల రాంబాబు (45) కుటుంబంతో కలిసి నాగార్జున సాగర్ సందర్శనకు వెళ్లాడు. శివాలయం పుష్కర ఘాటు దగ్గర కాలుజారి నదిలోకి పడిపోయి గల్లంతయ్యాడు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదిలారు. దీంతో.. నాగార్జున సాగర్ అందాలను వీక్షించడానికి పర్యాటకులు ఆదివారం భారీగా తరలివెళ్లారు. అలా వెళ్లిన పర్యాటకుల్లో నదిలో గల్లంతయిన రాంబాబు ఒకరు.

ఇలాంటి దుర్ఘటనే.. ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగాల జలపాతం దగ్గర జరిగింది. ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మహాన్వేష్ అనే యువకుడు మృతి చెందాడు. చనిపోయిన మహాన్వేష్ స్వస్థలం హైదరాబాద్ ఉప్పల్గా పోలీసులు గుర్తించారు. అనుమతి లేకున్నా ఉదయాన్నే మహాన్వేష్, అతనితో పాటు అతని స్నేహితులైన ఏడుగురు యువకులు జలపాతం దగ్గరకు వెళ్లారు. సెల్ఫీ తీసుకోడానికి నీళ్లలోకి దిగి జారి పడి మహాన్వేష్ ప్రాణాలు కోల్పోయాడు.