
హైదరాబాద్: తెలంగాణ ఆత్మ, ఆడబిడ్డల పండుగ, మన గడ్డకే పరిమితమైన పూల సింగిడి బతుకమ్మ పండుగ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఊరూరా, వాడ వాడన పూల జాతర షురూ అయ్యింది. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో ఉత్సాహంగా పూల పండుగ జరుపుకుంటున్నారు మహిళలు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత తన సొంతూరు సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామానికి వెళ్లారు. చింతమడకలోనే బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు.
చింతమడక గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిన్నారామ్ ముత్యం ఇంట్లో తోటి మహిళలతో కలిసి పాటలు పాడుతూ ఎంగిలి పూల బతుకమ్మను పేర్చారు కవిత. అనంతరం మహిళలతో కలిసి ఆడిపాడారు కవిత. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను బహిష్కరించడం.. సస్పెన్షన్ వేటు పడటంతో ఆమె పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత బతుకమ్మ వేడుకల కోసం ఆమె తొలిసారి కేసీఆర్ సొంతూరు చింతమడకకు వెళ్లడంతో కవిత పర్యటనపై ఆసక్తి నెలకొంది.
మరోవైపు.. వరంగల్ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కావ్య హాజరయ్యారు. ఈ ఏడాది ఓరుగల్లు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తుంది. ఆదివారం ఓరుగల్లులో మొదలైన బతుకమ్మ వేడుకలు ఈనెల 30న హైదరాబాద్ ట్యాంక్‍బండ్ వద్ద ముగియనున్నాయి. వేయి స్థంభాల గుడిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకునేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు.