ఆలేరు ఎమ్మెల్యే భర్త నన్ను బెదిరించారు 

ఆలేరు ఎమ్మెల్యే భర్త నన్ను బెదిరించారు 
  • పోలీసులకు ఐసీడీఎస్​ సూపర్​వైజర్​ ఫిర్యాదు
  • బాల్యవివాహం ఆపడానికి వెళితే ఫోన్ లో​వార్నింగ్​ ఇచ్చారు
  • ఆధారాలు ఉన్నాయా అని పోలీసులు అడిగారని ఆరోపణ

యాదాద్రి, వెలుగు: బాల్య వివాహం ఆపేందుకు ప్రయత్నించిన తనపై ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త మహేందర్​రెడ్డి బెదిరింపులకు దిగారని ఐసీడీఎస్​ సూపర్​వైజర్​ సూర్యకళ యాదాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఆలేరు పట్టణంలో బాల్య వివాహం జరుగుతోందని ఆలేరు ఐసీడీఎస్​ సీడీపీవో చంద్రకళకు ఫిర్యాదు అందింది. ఆ వివాహం ఆపాలని సీడీపీవో ఆదేశించడంతో సూపర్​వైజర్​ సూర్యకళ పెళ్లి జరుగుతున్న చోటుకు వెళ్లారు. పెళ్లిని అడ్డుకుని ఇరు పక్షాలకు కౌన్సెలింగ్​ ఇచ్చారు. ఆ టైమ్​లో ముస్తఫా అనే వ్యక్తి నీ అంతు చూస్తానని సూర్యకళను బెదిరించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే తనకు ఫోన్​వచ్చింది. తాను ఎమ్మెల్యే భర్త మహేందర్​రెడ్డి అని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి.. పెళ్లిపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడానని, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పారని సూర్యకళ చెప్పారు.

తన డ్యూటీ తాను చేస్తున్నానంటూ చెప్పినా.. అవతలి నుంచి హెచ్చరికలు ఆగలేదన్నారు. దీంతో తన విధులను ఎమ్మెల్యే భర్త మహేందర్​రెడ్డి అడ్డుకుంటున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యే భర్త ఫోన్​ చేసినట్టు ఆధారాలున్నాయా? లేకుంటే ఎలా ఫిర్యాదు చేస్తారంటూ పోలీసులు తనను ప్రశ్నించారని సూర్యకళ చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వస్తేనే కేసు నమోదు చేస్తామని చెప్పారని, మధ్యాహ్నం ఫిర్యాదు చేసినా.. సాయంత్రం వరకూ ఎఫ్ఐఆర్​నమోదు చేయలేదని ఆరోపించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న తమకే బెదిరింపులు వస్తుంటే మామూలు మహిళల పరిస్థితి ఏంటని సూర్యకళ ప్రశ్నించారు. ఎమ్మెల్యే భర్తపై ఫిర్యాదు చేయడంతో పెద్దవాళ్లతో ఎందుకు పెట్టుకున్నావని తమ డిపార్ట్​మెంట్​కు చెందిన కొందరు భయపెడుతున్నారని చెప్పారు.