కరోనాపై ఐసీఎంఆర్ కొత్త గైడ్‌‌లైన్స్.. తప్పక తెలుసుకోవాల్సిందే 

V6 Velugu Posted on Apr 23, 2021

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్ల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఆలిండియా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్, ఢిల్లీ) సంయుక్తంగా పలు మార్గదర్శకాలు విడుదల చేశాయి. తేలికపాటి కరోనా లక్షణాలు కలిగిన వారితోపాటు వైరస్‌తో ఆరోగ్యం విషమించిన వారికి ఉపయోగపడేలా ఈ కొత్త గైడ్‌‌లైన్స్‌ను రూపొందించారు. కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న రెమిడిసివిర్‌‌తోపాటు టొకిలిజుమబ్, ప్లాస్మా వాడకం పైనా ఇందులో సూచనలు ఉన్నాయి. 

ఐసీఎంఆర్ కొత్త గైడ్‌‌లైన్స్: 

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరంగా ఉంటే మైల్డ్ సింప్టమ్స్ ఉన్నట్లుగా భావించాలి.  
  • శ్వాసక్రియ రేటు నిమిషానికి 24గా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గదిలో SpO2 నిష్పత్తి 90 నుంచి 93 శాతంగా ఉంటే కరోనా లక్షణాలు కొంచెం ఎక్కువగా ఉన్నట్లే.
  • శ్వాసక్రియ రేటు నిమిషానికి 30గా ఉండటం, ఊపిరి తీసుకోలేకపోవడం, SpO2 నిష్పత్తి 90 శాతానికి కింద ఉంటే కరోనా సింప్టమ్స్ తీవ్రంగా ఉండి, పేషెంట్ పరిస్థితి సీరియస్‌గా ఉందని గ్రహించాలి.  
  • సామాజిక దూరం, ఇండోర్‌‌లోనూ మాస్క్ వేసుకోవడం, పరిశుభ్రంగా ఉండటం తప్పనిసరి. 
  • మల్టీ విటమిన్స్, యాంటీ పైర్‌టిక్స్ మెడిసిన్స్ వేసుకోవాలి.
  • డాక్టర్‌‌ను తరచూ సంప్రదించాలి.
  • SpO2 లేదా పల్స్ ఆక్సీమీటర్‌‌ సాయంతో టెంపరేచర్, ఆక్సీజన్ సాచ్యురేషన్‌ను నిరంతరం చెక్ చేసుకోవాలి. 
  • శ్వాస తీసుకోవడంలో సమస్యగా అనిపిస్తే వైద్యసాయం అవసరమని గ్రహించాలి.
  • 5 రోజుల వరకు జ్వరం, దగ్గు తగ్గనట్లయితే వైద్యుడ్ని వెంటనే కలవాలి. 
  • 60 ఏళ్లు పైబడిన వారు, బీపీ, డయాబెటిస్, ఊపిరితిత్తులు, కాలేయం, ఊబకాయంతో బాధపడుతున్న వారితోపాటు హృద్రోగులకు కరోనా వల్ల ఎక్కువ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వైరస్ బారిన పడి చనిపోతున్న వారిలోనూ వీరి సంఖ్య ఎక్కువేనని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 

Tagged Covid-19, AIIMS, ICMR, Corona patients, Clinical Guidance

Latest Videos

Subscribe Now

More News