మలేరియాకు స్వదేశీ వ్యాక్సిన్..మలేరియా ఏ దశలో ఉన్నా చెక్ పెడుతుంది

మలేరియాకు స్వదేశీ వ్యాక్సిన్..మలేరియా ఏ దశలో ఉన్నా చెక్ పెడుతుంది

మలేరియా..ఈ పేరు వినగానే చలితో కూడిన జ్వరం, దోమల కాటు గుర్తుకు వస్తాయి. మలేరియా వచ్చిందా భయంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతుంటాం..ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మలేరియా బారిన పడుతున్నారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధి పేదరికం, ఆరోగ్య సేవలకు అందకపోవడం,అపరిశుభ్రమైన పరిస్థితులతో వ్యాప్తి చెందుతుంది.అలాంటి మలేరియా వ్యాప్తిని అరికట్టి నిర్మూలించే దిశగా  ICMR టీకాలను తయారు చేసింది..ఇప్పటివరకు ఒక్కో దశకు సంబంధించి మాత్రమే టీకాలు ఉండేవి. ఇప్పుడు దేశీయంగా తొలిసారి మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్ ను తయారు చేశారు..తాజాగాఈ వ్యాక్సిన్ తయారీకి కంపెనీలకు అనుమతులు మంజూరు చేసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.    

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)  మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్ AdFalciVax తయారీకి ఐదు ఫార్మా కంపెనీలకు లైసెన్స్ అనుమతినిచ్చింది. ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్, టెక్నివెన్షన్ లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, పనాసియా బయోటెక్ లిమిటెడ్, బయోలాజికల్ ఈ లిమిటెడ్, జెండస్ లైఫ్ సైన్సెస్ కంపెనీలను AdFalciVax తయారీకి అనుమతులను జారీ చేసింది. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ పద్దతిలో జూలైలో కంపెనీల ఎంపిక ప్రక్రియ ప్రారంభించిన ఐసీఎంఆర్..మల్టీస్టేజ్ మలేరియా వ్యాక్సిన్ తయారీకి ఆసక్తిగల కంపెనీలనుంచి దరఖాస్తులను స్వీకరించి ఈ ఐదు కంపెనీలను సెలెక్ట్ చేసింది. 

మల్టీస్టేజ్ మలేరియా వ్యాక్సిన్ AdFalciVax ..

AdFalciVax అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR),డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (DBT-NII) ద్వారా దేశంలో అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి స్వదేశీ, మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్. ఇది అత్యంత ప్రాణాంతకమైన మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం ఫాల్సిపరం పరాన్నజీవిని లక్ష్యంగా పనిచేస్తుంది. లాక్టోకాకస్ లాక్టిస్‌లో రీకాంబినెంట్ DNA టెక్నాలజీని ఉపయోగించి పరాన్నజీవి ప్రీ-ఎరిథ్రోసైటిక్ (కాలేయం) దశ ,లైంగిక దశ రెండింటికీ వ్యతిరేకంగా పనిచేసే యాంటిజెన్లను మిళితం చేస్తుంది. ఇన్ఫెక్షన్‌ను నివారించడం,దోమల ద్వారా కమ్యూనిటీ వ్యాప్తిని తగ్గించడం దీని టార్గెట్. 

పరాన్నజీవి రక్తప్రవాహంలోకి ప్రవేశించే ముందే AdFalciVax  దానిపై ప్రభావం చూపుతుంది.  ప్రారంభ దశలో సంక్రమణను అడ్డుకుంటుంది. 
ఈ టీకా జన్యుపరంగా ఆహార-గ్రేడ్ బాక్టీరియల్ హోస్ట్ అయిన లాక్టోకాకస్ లాక్టిస్‌ను దాని ప్రధాన సాంకేతికతగా ఉపయోగిస్తుంది

ఈ వ్యాక్సిన్ ICMR–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (ICMR-NIMR) ,నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (NII), ఢిల్లీ సహకారంతో ప్రీ-క్లినికల్ టెస్టుల్లో విజయం సాధించింది.