సైద్ధాంతిక విధేయతదే విజయం

సైద్ధాంతిక విధేయతదే విజయం

విలువలతో కూడిన రాజకీయాలపై మన నమ్మకాన్ని పునరుద్ధరించే  ఘటనలు ప్రజా జీవితంలో చాలా అరుదుగా జరుగుతుంటాయి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు నియామకం కూడా అటువంటిదే. నా వరకూ ఇది అవకాశవాదంపై  సైద్ధాంతిక విధేయత  సాధించిన విజయం.  తాత్కాలిక లబ్ధిపై  దీర్ఘకాలిక  సేవ సాధించిన ఘన విజయం.  

పార్టీలు మారడం అనేది సర్వసాధారణం అయిపోయినవేళ,   సైద్ధాంతికంగా  విధేయంగా ఉండడం వల్ల  కూడా  రాజకీయ జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగవచ్చనీ,  నికరంగా,  నిరంతరంగా ఒకే పార్టీలో కొనసాగినా విలువ ఉంటుందనీ  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  రామచంద్రరావు  నియామకం ద్వారా తెలుస్తోంది. ఇది  కేవలం ఒక్కరాత్రికి  రాత్రే జరిగిపోయింది కాదు.  నాలుగు దశాబ్దాలపాటు వెనక్కు తగ్గకుండా అలుపెరగని కృషి, వ్యక్తిగత స్వార్థం లేకుండా పార్టీకి అంకితభావంతో చేసిన సేవకు దక్కిన అత్యున్నత ప్రతిఫలం. 

బీజేపీ తెలంగాణ అధికార  ప్రతినిధులుగా  ఉన్నప్పుడు  ఆయనతో  కలసి  దాదాపు 12 ఏళ్లపాటు పనిచేసే అవకాశం నాకు దొరికింది.  నేను కొత్తగా వచ్చిన సమయానికి, ఆయన సీనియర్​గా ఉండేవారు.  ఆయనలోని  స్థితప్రజ్ఞత ఆయన బలం అని గమనించాను.  

సిద్ధాంతాలే దిక్సూచిగా..రాజకీయ  డ్రామాలాడే  మనిషి కాదు  ఎన్ రామచంద్రరావు,  ఒక బలమైన అంకితభావంతో ఉన్న వ్యక్తి ఆయన.  క్రమేపీ ఆయన ఎదుగుదల స్థిరంగా,  ఎంతో ఓపికతో, సిద్ధాంతాలను విడువకుండా, పార్టీ భావజాలంతో మమేకమౌతూ జరిగింది.  ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ  విద్యార్థి  నాయకుడిగా మొదలు ఆయనెప్పుడూ  భావజాలాన్ని విడవలేదు. 

 తొలిదశ నుంచి అధికార ప్రతినిధిగా,  ప్రధాన కార్యదర్శిగా,  ఎమ్మెల్సీగా, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా  ఎన్నడూ షార్ట్​కట్​లు తీసుకోలేదు.  పెద్దపేరు తెచ్చే పదవులు  లేనప్పుడూ,  తక్కువ గుర్తింపే ఉన్న రోజుల్లోనూ  ఆయన  పార్టీలోనే ఉన్నారు.  ఆయనను ఎవరూ  గుర్తించనప్పుడు కూడా పార్టీ కోసమే పనిచేశారు. ఈనాటి  రాజకీయ  వాతావరణంలో,  సిద్ధాంతాలు అనేవి ఎన్నికల ప్రచార సమయంలో  వేసుకుని,  తెర వెనకాల మాత్రం పక్కకు విసిరేసే కండువాల్లాంటివిగా అయిపోయాయి.  కానీ,  ఎవరైతే నిజంగా ఒక ఆలోచనతో ప్రజా జీవితంలో ఉంటారో వారికి సిద్ధాంతాలు అనేవి ఒక ఆప్షన్ కాదు, అదే వారిని నడిపించే దిక్సూచి . బీజేపీ వంటి పార్టీలకు సిద్ధాంతాలే పునాది తప్ప రాజకీయాలు కాదు.  సిద్ధాంతాలు గాలివాటంగా వచ్చి వెళ్లిపోయేవి కాదు. అందులో రామచంద్రరావువంటివారు  సుదీర్ఘ బాటసారులు. 

 పార్టీ మార్పిడి సంస్కృతి

విధేయతకు కాలం చెల్లిందనీ,  స్వలాభం ముఖ్యం అనీ, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికి నేర్పిస్తుంది  ఈ పార్టీ మార్పిడి సంస్కృతి.  దారుణం ఏంటంటే ఇలా వచ్చేవాళ్లు చాలామంది, తమకేదో హక్కు ఉన్నట్టుగా వస్తారు. పెద్ద పదవులు అడుగుతారు,  వేదికలపై  కీలకంగా ఉండాలనుకుంటారు, అప్పటికప్పుడు గుర్తింపు వచ్చేయాలి అనుకుంటారు. అదే సమయంలో ఆ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినవారిని ఇంకాస్త ఓపిగ్గా ఎదురు చూడమని సలహాలు చెబుతారు.  ఆ ఎదురుచూపులు ఎంత కాలమో కూడా తెలియదు.  దాదాపు 12 ఏళ్ల పాటు బీజేపీ తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధిగా ఉన్న నేను ఈ  విషయాన్ని  స్పష్టతతో  నిశ్చయంగా చెప్పగలను. 

విధేయత కోసం..

ఇతర  రాజకీయ పార్టీలు నాకు ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు,  ఆయా పార్టీల్లో పెద్ద స్థానాలు, ఉన్నత పదవులు, రాష్ట్ర ప్రభుత్వ పదవులు, మరింత పేరు తెచ్చేవి,  మరింత సౌకర్యాలిచ్చేవాటిని ఆశచూపారు. తమ పార్టీలోకి రమ్మని... కానీ వాటన్నిటినీ తిరస్కరించాను.  కారణం చేతకాక, చేయలేక, ఆశ,- ఆసక్తీ లేక కాదు, విధేయత కోసం!  ఒక  సిద్ధాంతానికి సేవ చేయడానికి బీజేపీలో చేరాను, అంతే తప్ప పదవుల వెంట పడడానికి కాదు.  ఈ పార్టీ ఏ సిద్ధాంతాల కోసం ఉందో దాని కోసం నేను బౌద్ధికంగా, మానసికంగా, వ్యూహాత్మకంగానేకాక భావోద్వేగంతో కట్టుబడి ఉన్నాను.  

అనేక వేదికలపై  నేను దాన్ని ప్రతిబింబించాను.  క్షేత్రస్థాయి నుంచీ పనిచేసి, కఠినమైన రాజకీయ పరిస్థితుల్లో పార్టీ తరఫున నిలబడి వాదించాను. కానీ,  సైద్ధాంతిక  విధేయతను పక్కనపెట్టేసి చివరి నిమిషంలో వచ్చేవారికి  స్వాగత  సత్కారాలు అందడం చాలా బాధించింది.  అటువంటి సందర్భంలో రామచంద్రరావు నియామకం చాలా ముఖ్యమైనది.  విధేయత, సమర్థత, నిబద్ధత ఉన్న  నాలాంటి  వేలాది కార్యకర్తల  నమ్మకాన్ని పెంచిందీ నియామకం.  సైద్ధాంతిక నిబద్ధతకు ఇంకా విలువ ఉందనీ,   పార్టీ కష్ట కాలంలో కలసి నడిచినవారికి, పార్టీకి మంచి రోజులు వచ్చినప్పుడు గుర్తింపు ఉంటుందనీ నిరూపించిందీ నియామకం. ఈ నియామకం ద్వారా ఒక వ్యక్తిని ఎంపిక చేయడం కాదు, ఒక సందేశాన్ని ఇచ్చినందుకు పార్టీ జాతీయ,  రాష్ట్ర నాయకత్వానికి నా అభినందనలు.  

పార్టీని నమ్మి కొనసాగాలి

ఈ  సంధికాలంలో  భారతదేశంలో మనం ఎలాంటి రాజకీయాలు కావాలనుకుంటున్నాం అనే దాని గురించి కూడా చర్చించాలి. దేశ రాజకీయాలు ఆ దేశతత్త్వానికీ, ఆ దేశ వ్యక్తిత్వానికీ అద్దంపడతాయి. అవకాశవాదులు, నేరస్తులు, అధికార దాహంతో ఉన్న వారిదే  రాజకీయాల్లో  పైచేయి అయితే అప్పుడు మొత్తం ప్రజాస్వామ్యం ఒక డొల్లగా మిగిలిపోతుంది. 

ఏ నేర చరిత్రా లేని, యువతను, విద్యావంతులైన వృత్తి నిపుణులను, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన  పౌరులను  రాజకీయాల్లోకి  తీసుకురావల్సిన బాధ్యత బీజేపీ సహా అన్ని పార్టీలపై ఉంది.  రాజకీయం అనేది  ఏ పనీపాట లేనివారి చివరి గమ్యం కాదు...నైతిక విలువలు, దేశభక్తి,  స్ఫూర్తివంతులైన వారికి  ప్రథమలక్ష్యం కావాలి. ఇది మెల్లిగా చేసేది కాదు, తక్షణావసరం.  ఒక పక్క నుంచి అన్నీ గమనిస్తోన్న యువతకు నేనొకటి  చెప్పాలనుకుంటున్నాను.  రాజకీయాల్లోకి రావడం ఉద్యోగమో, వృత్తో మారడం కాదు.. ఇది జీవితకాలపు నిర్ణయం.

రామచంద్రరావుకు శుభాకాంక్షలు! 

యువతా..మీ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా ఎంచుకోండి. మీ పార్టీలో ఉంటే లాభం కలుగుతుందని కాకుండా, మీ పార్టీ  ‘సరైనదని’  నమ్మి కొనసాగండి. రామచంద్ర రావు  సీనియారిటీని డిమాండ్ చేయలేదు,  ఆయన సాధించుకున్నారు. ఆయన నికరంగా నిలబడ్డారు, సేవ చేశారు, ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నారు. ఇలాంటి రాజకీయమే ఈ రోజుల్లో కావల్సింది. 'నాకేంటి?' అనే లెక్కలపై, నిబద్ధత సాధించిన విజయం ఇది!  కాకాపట్టే  సంస్కృతిపై సహనం సాధించిన విజయం ఇది!  మా సీనియర్ రామచంద్రరావుకి నా హృదయపూర్వక  శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.  ఎదగాలన్న తపనే కాకుండా, నిజాయితీ కూడా ఉన్న కొత్త తరం నాయకులకు మీ నాయకత్వం  ఒక మార్గదర్శనం కాగలదని ఆశిస్తున్నాను. ఎందుకంటే అంతిమంగా అధికారానిది కాదు, లక్ష్యానిది విజయం.

భావజాలాలు మార్చేసుకుంటున్నారు

ప్రస్తుతం  భారతదేశ  రాజకీయాలను  వేధిస్తున్నదేంటో  నిజాయితీగా  మాట్లాడుకుందాం.  పార్టీ మార్పిళ్ల  సంస్కృతి.. జాతి సిగ్గుపడేలా తయారయింది.  ఈ రోజుల్లో  నాయకులు కేవలం  వారాల  వ్యవధిలోనే  అతివాద  వామపక్షం నుంచి అతివాద  రైట్ వైపు వస్తున్నారు. బట్టలు మార్చినంత  తేలికగా లౌకికవాద సోషలిజం నుంచి ఆవేశపూరిత జాతీయవాదం వైపు వారి భావజాలాలు మార్చేసుకుంటున్నారు. ఇవాళ ఒక పార్టీ  మౌలిక  పునాదులనే తిడతారు, మరునాడు అదే పార్టీ  పోస్టరుపై కనిపిస్తారు.  పార్టీ  మారడం  రాజ్యాంగ వ్యతిరేకమా అంటే కాదు.  కానీ, అది వినాశకారమా అంటే కచ్చితంగా అవుననే చెప్పాలి.  ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. 

- కె. కృష్ణ సాగర్ రావు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి -