
- మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
పద్మారావునగర్, వెలుగు: ఓ ఇంటిపై హోం లోన్ ఉండగా.. బ్యాంకు అధికారులు ఆ ఇంటిలో ఉంటున్న ఓనర్‌తో పాటు కిరాయిదారులను అకస్మాత్తుగా ఖాళీ చేయించారు. ఓనర్‌కు గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ.. కిరాయిదారులకు మాత్రం ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వలేదు. ఉన్నట్టుండి వారిని ఖాళీ చేయించడంతో అద్దెదారులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు.
సికింద్రాబాద్ సెకండ్ బజార్‌లో ఓ వ్యక్తి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో హోంలోన్ తీసుకుని జీ+3 బిల్డింగ్ కట్టాడు. కొన్ని నెలలుగా లోన్ కట్టకపోవడంతో ఆయనకు బ్యాంకు అధికారులు గతంలో నోటీసులు ఇచ్చారు. ఈ బిల్డింగ్ మూడో ఫ్లోర్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ముగ్గురు ఉంటుండగా.. ఇందులో ఇద్దరికి ఇటీవలే సర్జరీ అయి విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో జులై 30న బ్యాంకు అధికారులు ఆ ఇంటికి వచ్చారు. లోన్ కట్టనందున ఇల్లు సీజ్ చేస్తున్నామని చెప్పారు. కనీస సమాచారం లేకుండా తమను బయటికి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని అద్దెదారులు ప్రశ్నించినా వినిపించుకోలేదు. సామగ్రి లోపల ఉండగానే వారిని బయటికి గెంటేసి ఇంటిని సీజ్ చేశారు. దీంతో వారు ఓ హోటల్లో ఉంటున్నారు. తమ సామగ్రి ఇవ్వమన్నా ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. తమను అమాననీయంగా బయటికి గెంటేసి, సామగ్రిని అకారణంగా సీజ్ చేసిన బ్యాంకుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు చెన్నమ్మ మంగళవారం రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.