
- టీచర్, పోలీసు, ఇతర పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎస్‌కు ఆదేశం
- సెకండ్ టర్మ్ పవర్‌లోకి వచ్చిన మూడో ఏడాది తొలిరోజు జాబుల ముచ్చట
- ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన వెంటనే కేసీఆర్ డెసిషన్
- సీఎం ప్రకటనపై నిరుద్యోగుల్లో అసహనం
- పోలీస్, విద్యాశాఖలోనే 70 వేలకుపైగా వెకెన్సీలు
- మిగిలిన శాఖల్లో మరో 75 వేలకుపైగా ఖాళీలు
- నెలకు సగటున 600 చొప్పున
- ఆరేండ్లలో 43 వేల మంది రిటైర్మెంట్
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాల భర్తీ కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఖాళీల వివరాలు సేకరించి, వెంటనే నోటిఫికేషన్ల విడుదలకు రెడీ కావాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రులు, ఆఫీసర్లతో సీఎం సమీక్షించారు. రెండోసారి అధికారంలోకి వచ్చి మూడో ఏడాది ప్రారంభమైన మొదటి రోజే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లపై ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లివచ్చిన వెంటనే సమీక్షించారు. ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయి? అత్యవసరంగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ఏమిటి? అనే వివరాలు తీసుకున్నారు. ఖాళీగా ఉన్న టీచర్, పోలీసులతో పాటు ఇతర పోస్టులకు సంబంధించిన వివరాలు త్వరగా సేకరించాలని ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 50 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు సమాచారం ఉందని, వాటన్నింటినీ భర్తీ చేయాలన్నారు. వేల సంఖ్యలో టీచర్, పోలీస్ పోస్టులు రిక్రూట్ చేయాల్సి ఉందని చెప్పారు. వీటితో పాటు ఇతర శాఖల్లోని ఖాళీలను నోటిఫై చేయాలన్నారు. ఏయే శాఖల్లో ఎంత మంది ఉద్యోగులు అవసరమో వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఖాళీల లెక్క తేలిన వెంటనే వాటిని భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు.
రాష్ట్రంలోని గవర్నమెంట్ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలతోపాటు పోలీస్స్టేషన్లలో లక్షన్నర పోస్టులు ఖాళీగా ఉంటే.. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం ప్రకటించడంపై నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెల నెలా 500 నుంచి 600 మంది చొప్పున ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ఇట్ల ఆరేండ్లలో రిటైర్ అయిన వాళ్లతో ఏర్పడిన ఖాళీలే సుమారు 43 వేల దాకా ఉంటాయని, ఆ పోస్టుల మాటేమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. స్కూల్, ఇంటర్, హయ్యర్ఎడ్యుకేషన్తోపాటు పోలీస్శాఖల్లోనే మొత్తంగా 70 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయని, ఇతర శాఖల్లో మరో 75 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటన్నింటిని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎక్కడా సరిపడా స్టాఫ్ లేదు
రాష్ట్రంలోని గవర్నమెంట్ ఆఫీసులు, విద్యాసంస్థలు, పోలీస్స్టేషన్లు సరిపడా స్టాఫ్ లేక ఇబ్బంది పడుతున్నాయి. ఏండ్ల తరబడి ఖాళీలు భర్తీ చేయకపోవడంతో మిగతా ఉద్యోగుల మీద పనిభారం పెరుగుతోంది. ఎంతో ఆర్భాటంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసిన సర్కార్.. కొత్త పోస్టులను మాత్రం మంజూరు చేయలేదు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోందించిన పాత కేడర్ స్ట్రెంత్ ప్రకారమే ఎడ్యుకేషన్, హెల్త్, పోలీస్, రెవెన్యూ, వెల్ఫేర్ తదితర 32 డిపార్ట్మెంట్లలో కలిపి 4.57 లక్షల పోస్టులు ఉంటే.. ప్రస్తుతం 3.09 లక్షల మంది పని చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మరో 1.48 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నప్పటికీ.. కేవలం 50 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేసేందుకు సర్కార్ సిద్ధం కావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆరేండ్లలో టీఎస్పీఎస్సీ భర్తీ చేసింది 35,724 పోస్టులే
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఆరేండ్లలో కేవలం 39,952 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తే.. వాటిలో 35,724 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసినట్టు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తాజాగా ప్రకటించారు. పోలీస్, గురుకులాలతోపాటు పంచాయతీరాజ్శాఖలోనూ కొన్ని పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. కానీ ఎన్నడూ జంబో నోటిఫికేషన్ మాత్రం వేయలేదు. ఇప్పటికీ టీఆర్టీ – 2017 నోటిఫికేషన్లో వేసిన పోస్టులు, మరికొన్ని గురుకుల పోస్టులు భర్తీ చేయలేదు. టీఎస్పీఎస్సీలో కూడా పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం.
జిల్లాల విభజన అయినా కొత్త పోస్టులు రాలె
రాష్ట్రంలో 2016 లో తొలిసారిగా జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన జరిగింది. ఆ తర్వాత కూడా పలుమార్లు జిల్లాలు, రెవెన్యూడివిజన్లు, మండలాల విభజన జరగ్గా, ఇంకా ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. అయితే కొత్తగా ఏర్పడిన జిల్లాలు, డివిజన్లు, మండలాలకు మాత్రం కొత్తగా కేడర్ స్ర్టేంత్ను అలాట్ చేయలేదు. పాత కేడర్‌నే కొత్త చోట్లకు సర్దుబాటు చేసి, చేతులు దులుపుకున్నారు. అయితే జోనల్ విధానంపై స్పష్టత లేకపోవడంతోనే, భర్తీ చేయడం లేదని సర్కారు పెద్దలు అంటున్నారు. కానీ దానిపై స్పష్టత తీసుకురావాల్సిన బాధ్యత సర్కారుదే అనే విషయం మరిచిపోయారు. దీంతో ఉన్న ఎంప్లాయీస్ వర్క్ ప్రెషర్‌తో అవస్థలు పడుతున్నారు.
పోలీస్, విద్యాశాఖలోనే 70 వేలకుపైగా ఖాళీలు
మొత్తం లక్షన్నర సర్కారు పోస్టులు ఖాళీగా ఉంటే, కేవలం విద్యా, పోలీస్ శాఖల్లోనే 70 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా విద్యాశాఖలో ఆఫీసర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, టీచర్లతో పాటు అడ్మినిస్ట్రేషన్, నాల్గో తరగతి ఎంప్లాయీస్ పోస్టులున్నాయి. పోలీస్ శాఖలోనూ ఎస్ఐల నుంచి కానిస్టేబుల్ వరకూ వివిధ స్థాయిల్లోని ఖాళీలున్నాయి. విద్యాశాఖలో మొత్తం 37,559 పోస్టులు ఖాళీగా ఉండగా.. వీటిలో స్కూల్ ఎడ్యుకేషన్ లో 24,702 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో 12,857 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఏండ్ల నుంచి ఖాళీగా ఉన్నాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారు జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలతో పాటు యూనివర్సిటీల్లో ఒక్క పోస్టునూ భర్తీ చేయలేదు. 2016లోనే యూనివర్సిటీల్లో మొత్తం పోస్టులు 1,528 వరకు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటిలో 323 ప్రొఫెసర్, 687 అసోసియేట్ ప్రొఫెసర్లు, 518 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. వీటిని ఇప్పటికీ భర్తీ చేయలేదు. ప్రస్తుతం ఈ ఖాళీల సంఖ్య మరో 500 పెరిగాయని ప్రొఫెసర్లు చెప్తున్నారు. రెండేండ్ల నుంచి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వీసీలు కూడా లేరు. పోలీస్‌శాఖలో మొత్తం 96,643 సాంక్షన్డ్ పోస్టులుండగా.. ప్రస్తుతం 59,425 పని చేస్తున్నారు. మరో 37,218 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది 17,156 సివిల్, ఏఆర్, ఎస్‌పీఎఫ్, జైలు వార్డెన్, సివిల్ ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, ఇప్పుడిప్పుడు కొందరికి పోస్టింగ్‌లు ఇస్తున్నారు. అయితే భారీగా పోస్టులు ఖాళీగా ఉండటంతో.. పోలీసులకు ఇస్తామన్న వీక్లీ ఆఫ్‌ను కూడా అమలు చేయడం లేదు.
హెల్త్‌లో బాగానే ఖాళీలు
రాష్ట్రంలో మెడికల్ అండ్ ఫ్యామిలీ హెల్త్ డిపార్ట్మెంట్లోనూ భారీగానే ఖాళీలున్నాయి. నర్సుల నుంచి డాక్టర్ల దాకా పోస్టులు టెంపరరీగానే భర్తీ చేస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్లో 48,889 సాంక్షన్డ్ పోస్టులుంటే, వాటిలో 25,377 మంది పనిచేస్తుండగా, 23,512 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన డాక్టర్ పోస్టులే 2,200కుపైగా ఖాళీగా ఉన్నాయి. స్టేట్‌లో సర్కార్ దవాఖాన్లలో 30 వేల వరకు బెడ్స్ ఉండగా.. రూల్స్ ప్రకారం మూడు షిఫ్టులు కలిపి 18 వేల నుంచి 20 వేల మంది నర్సులు ఉండాలి. కానీ కేవలం 4,473 మంది రెగ్యులర్ నర్సులు పనిచేస్తున్నారు. మిగిలిన పోస్టుల్లో కొన్నింటిని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ద్వారా కొనసాగిస్తున్నారు.
సంక్షేమ శాఖల్లోనూ అదే పరిస్థితి
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల్లోని ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. ఎస్సీ వెల్ఫేర్‌లో 5,534, ట్రైబల్ వెల్ఫేర్‌లో 5,852, బీసీ సంక్షేమశాఖలో 1,027 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు రెవెన్యూశాఖలో 8,118 పోస్టులు, పంచాయతీరాజ్‌లో 5,929 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రెవెన్యూశాఖలో పనిచేసే చాలామంది ఉద్యోగుల పనులు తగ్గించి, వారిని వేరే శాఖల్లోకి బదిలీ చేస్తామని ప్రకటించారు. వివిధ శాఖల్లోనూ ఇదే పరిస్థితి తీసుకొస్తున్నారు.
జోనల్ విధానంపై తేల్చకుండా పోస్టుల భర్తీ ఎలా ?
50 వేల పోస్టులను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించినప్పటికీ.. ఈ ప్రక్రియ అంత త్వరగా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే 2018 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్త జోనల్విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానం ప్రకారం రాష్ట్రాన్ని రెండు మల్టీజోన్లు, ఏడు జోన్లు, 31 జిల్లాలుగా విభజించారు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్తగా మరో రెండు జిల్లాలు ఏర్పాటు కావడంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. దీంతో మల్టీజోన్లు, జోన్ల పరిధిలో ఏయే జిల్లాలు వస్తాయనే అంశంపై స్పష్టత లేదు. కొత్త విధానం ప్రకారం.. ముందుగా స్థానికత, కేడర్ ఆధారంగా మల్టీ జోన్లు, జోన్లు, జిల్లా స్థాయిలో ఉద్యోగులను విభజించాలి. ఇందుకోసం ప్రతి ఎంప్లాయ్‌కి ఆప్షన్ ఇవ్వాలి. వారి సుముఖత, శాఖల సౌలభ్యం ప్రకారం బైఫర్కేషన్ ప్రక్రియ పూర్తయితేనే కేటగిరీల వారీగా పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలపై స్పష్టత రానుంది. జోనల్ విధానం అమల్లోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టలేదు. ఈ ప్రక్రియను ఇప్పుడు ప్రారంభించినా.. ఇది పూర్తయ్యే వరకు మరో ఆరు నెలలైనా పట్టొచ్చని, కసరత్తు పూర్తి చేసి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏడాది పట్టొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
రెండున్నరేండ్ల నుంచి టెట్ పెట్టలె
టీచర్ పోస్టుల ఎగ్జామ్స్ రాయాలంటే టెట్ క్వాలిఫై కావాలి. ప్రతి 6 నెలలకు ఒక సారి నిర్వహించాల్సిన ఈ పరీక్షను, తెలంగాణ వచ్చాక రెండు సార్లే నిర్వహించారు. టెట్ వ్యాలిడిటీ ఏడేండ్లు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు 6 సార్లు టెట్ పెట్టారు. 2011, 2012 జనవరి, 2012 జూన్ టెట్ వ్యాలిడిటీ ముగిసింది. 2014 మార్చి, 2016 మేలో, 2017 జులైలో నిర్వహించిన వాటి వ్యాలిడిటీ ఉంది. ఈ మధ్య బీఈడీ, డీఈడీ పూర్తయిన స్టూడెంట్స్, గతంలో వ్యాలిడిటీ పూర్తయినవాళ్లు, టెట్ క్వాలిఫై కానివాళ్లు కలిపి 4 లక్షల మందికి పైగా టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పెట్టకుండా టీచర్ పోస్టులను భర్తీ చేయడం కష్టం. టెట్ పెట్టి, టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటే ఏడాదైనా పట్టొచ్చని నిరుద్యోగులు అంటున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీఎన్నికల కోసమే నాటకం
త్వరలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే 50 వేల పోస్టులు భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్ల పోస్టులతోపాటు యూనివర్సిటీల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. వైద్యాఆరోగ్యశాఖలో ఖాళీలను, ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీల్లో ఖాళీగా ఉన్న 40 వేల ఉద్యోగాలను శాశ్వత పద్ధతిలో నియమించాలి.
– మానవతారాయ్,
విద్యార్థి-నిరుద్యోగ జేఏసీ చైర్మన్