విద్యార్థుల్లో దేశభక్తి మరింత పెంపొందించే ప్రయత్నంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం కీలక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో ‘వందేమాతరం’ గీతం పాడటాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు యోగి తెలిపారు.
గోరఖ్‌పూర్‌లో జరిగిన ‘ఏకతాయాత్ర’, ‘వందేమాతరం’ సామూహిక గానం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం “దేశగీతం వందేమాతరం పట్ల ప్రతి పౌరుడిలో గౌరవభావం ఉండాలి. పిల్లల్లో దేశభక్తి, ఐక్యత భావనలు పెంపొందించడమే ఈ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశ్యం” అని స్పష్టం చేశారు.
సమాజవాదీ పార్టీ ఎంపీ ఒకరు వందేమాతరం గీతానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆయన విమర్శించారు. సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతిని దాటవేసి జిన్నా వంటి నేతలను సత్కరించే వారే ఈ వ్యతిరేకత వెనుక ఉన్నారంటూ యోగి ఫైర్ అయ్యారు. దేశ సమగ్రతను భంగం కలిగించేలా ఎవ్వరూ ప్రవర్తించకూడదని హెచ్చరించారు. ఆ విధంగా ప్రయత్నించే వారి ఆలోచనలను మొలకెత్తక ముందే దెబ్బతీయాలని యూపీ ప్రజలకు పిలుపునిచ్చారు.
ALSO READ : మాకు ఊపిరి ఆడటం లేదు..
1896 నుంచి 1922 వరకు కాంగ్రెస్ ప్రతి సమావేశంలో వందేమాతరం పాడడమన్నది సంప్రదాయంగా ఉందని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. కానీ 1923లో మౌలానా మహమ్మద్ అలీ జౌహర్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ గీతానికి వ్యతిరేకత చూపడం భారత విభజనకు దారితీసిన ఒక కారణమని గుర్తుచేశారు యోగి. ఇదే సమయంలో ప్రధాని మోడీ దేశరాజధాని ఢిల్లీలో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. 2024 నవంబర్ 7 నుండి 2026 నవంబర్ 7 వరకు దేశవ్యాప్తంగా రెండు సంవత్సరాల పాటు ఈ మహోత్సవాలు కొనసాగనున్నాయి.
బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ 1875 నవంబర్ 7న ‘అక్షయ నవమి’ సందర్భంగా ఈ గీతాన్ని రచించి, తన నవల ‘ఆనందమఠ్’ లో భాగంగా ‘బంగదర్శన్’ పత్రికలో ప్రచురించారు. స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణ ఇచ్చిన ఈ గీతం భారత ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ 150వ వార్షికోత్సవం ప్రజల మనసుల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని మోడీ అభిప్రాయపడ్డారు.
