అవినీతి లేకుండా డబ్బంతా పేదలకే ఖర్చు చేస్తాం

అవినీతి లేకుండా డబ్బంతా పేదలకే ఖర్చు చేస్తాం

అమృత్సర్: చాలా ఏళ్ల తర్వాత పంజాబ్ రాష్ట్రానికి మొదటిసారిగా ఓ మంచి వ్యక్తి ముఖ్యమంత్రిగా వస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్  కేజ్రీవాల్  అన్నారు. రాష్ట్రంలో అవినీతి లేకుండా.. డబ్బంతా ప్రజల కోసమే వినియోగిస్తామని, ఎక్కడైనా అవినీతికి పాల్పడితే సొంత పార్టీ వారినైనా సరే జైలుకు పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అమృత్సర్ నగరంలో ఆదివారం కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న భగవంత్ మాన్ తో కలసి భారీ రోడ్ షో నిర్వహించారు. పంజాబ్ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకు గాను 92 స్థానాల్లో ఆప్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించి అధికారం చేపట్టబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పరాజయంపాలై కేవలం 18 సీట్లకే పరిమితం అయింది. 
పంజాబ్ లో తొలిసారిగా ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా అరవింద్ కేజ్రివాల్ మాట్లాడుతూ నిజాయితీ ఉన్న వ్యక్తి సీఎం గా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు. రాష్ట్రానికి భగవంత్ మాన్ ఒక్కడే సీఎం కాదు.. ప్రతి పౌరుడు కూడా ముఖ్యమంత్రితో సమానమేనన్నారు. అవినీతి, అధికార దుర్వినియోగానికి అవకాశం లేకుండా స్వచ్ఛమైన పాలన తెస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా జైలుకు పంపిస్తామని కేజ్రివాల్ ప్రకటించారు. 

 

ఇవి కూడా చదవండి

ప్రైవేట్ వైద్యాన్ని ప్రోత్సహించడానికే ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్