‘మా’కు వ్యతిరేకంగా చేస్తే సభ్యత్వాలు రద్దు: మంచు విష్ణు

‘మా’కు వ్యతిరేకంగా చేస్తే సభ్యత్వాలు రద్దు: మంచు విష్ణు
  • ‘మా’ అధ్యక్షుడిగా ఏడాది పూర్తయిన సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశం
  • 90 శాతం వాగ్దానాలు పూర్తి చేశాం
  • సంక్రాంతి తర్వాత ‘మా’ యాప్ ని తీసుకొస్తాం: మంచు విష్ణు

హైదరాబాద్:  మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)కు వ్యతిరేకంగా ఏ నటీనటులైనా.. కార్యవర్గ సభ్యులెవరైనా.. ధర్నాలు చేసినా.. మీడియాకు వెళ్లినా.. అలాంటి వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తామని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ‘మా’ కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా అలాంటి వారు అనర్హులవుతారని ఆయన స్పష్టం చేశారు. ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

‘‘2021లో జరిగిన ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. అక్టోబర్ 13న మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాను. నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పరిశ్రమలో ఎంతో అలజడి నెలకొంది. మా ఎన్నికల్లో నేను చేసిన వాగ్ధానాలు 90 శాతం పూర్తయ్యాయి. మా అసోసియేషన్ భవనానికి రెండు ప్రతిపాదనలు సూచించాను.  ఫిల్మ్ నగర్ కు అరగంట దూరంలో ఓ భవనం నిర్మిస్తున్నాం. ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం కట్టేందుకు నేను ఖర్చు భరిస్తాను... ఈ రెండో అంశానికే చాలా మంది సభ్యులు అంగీకరించారు.’’ అని మంచు విష్ణు వివరించారు. 

నటీనటుల అవకాశాల కోసం ప్రత్యేక బుక్ లెట్

నటీనటులకు అవకాశాల కోసం ప్రత్యేక బుక్ లెట్ తీసుకొస్తున్నామని.... సంక్రాంతి తర్వాత ‘మా’ యాప్ ని తీసుకొస్తామని మంచు విష్ణు వెల్లడించారు.  మా అసోసియేషన్ లో సభ్యత్వం ఉన్నవాళ్లే సినిమాల్లో నటించాలని నిర్మాతలకు సూచించామని, నిర్మాతల మండలి కూడా మా సూచనను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారని మంచు విష్ణు తెలిపారు. మా అసోసియేషన్ లో 20 శాతం మంది నటులు కాని సభ్యులున్నారని, ఇకపై మా అసోసియేషన్ సభ్యత్వాన్ని కఠినంగా ఉండేలా తుది నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.  నటీనటులు కనీసం రెండు సినిమాల్లో నటించి విడుదలైతేనే మాలో శాశ్వత సభ్యత్వం ఉంటుందని,  కనీసం 5 నిమిషాలైనా సినిమాలో కనిపించి డైలాగు చెప్పిన వాళ్లకు అసోసియేట్ సభ్యత్వం ఉంటుందని, అయితే అసొసియేట్ సభ్యులకు మాలో ఓటు హక్కు లేదన్నారు. 

‘మా’ ఎన్నికల్లో విష్ణు ఓడిపోవాలని కోరుకున్నవారు కూడా బాగుండాలి: మోహన్ బాబు

‘మా’ అసోసియేషన్ ఎన్నికల్లో విష్ణు ఓడిపోవాలని కోరుకున్నవారు కూడా బాగుండాలని మోహన్ బాబు అన్నారు.  నేను మా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కూడా ఎలాంటి మీటింగులు పెట్టలేదని గుర్తు చేశారు. చేసిన పనులు చెప్పుకోవడం మంచి పని.. సెల్ఫ్ డబ్బా కాదు... మా సభ్యులందరికి షిరిడీసాయి ఆశీస్సులుండాలని ఆకాంక్షించారు. ‘‘అందరూ కలసి ఐక్యంగా ఉండండి.. మంచు విష్ణు చేసే పనుల్లో మోసం లేదు..దగా లేదు..’’ అని మోహన్ బాబు చెప్పారు.