అక్రమ ప్రాజెక్టులు ఆపకుంటే..అలంపూర్‌ వద్దే నీళ్లు మళ్లించుకుంటం

అక్రమ ప్రాజెక్టులు ఆపకుంటే..అలంపూర్‌ వద్దే నీళ్లు మళ్లించుకుంటం
  • ఏపీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదు
  • అపెక్స్ కౌన్సిల్ లో సీఎం కేసీఆర్ వాదన

తెలంగాణకు అన్యాయం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోం. పోతిరెడ్డిపాడు సహా ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులు ఆపాలి. లేదంటే అలంపూర్‌-పెద్దమారూర్‌ మధ్య కృష్ణా నదిపై బ్యారేజీ కట్టి రోజుకు 3 టీఎంసీలు మళ్లించుకుంటం. తెలంగాణలో కొనసాగుతున్నవి ఉమ్మడి ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులే. గోదావరిలో రాష్ట్రానికి కేటాయించిన 967.94 టీఎంసీలకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నం. రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల లొల్లి పరిష్కారానికి కేంద్రం ముందుకు వస్తే పూర్తి సహకారం అందిస్తం.

– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌‌, వెలుగుకృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టులను ఏపీ ఆపకుంటే అలంపూర్‌‌ దగ్గర నుంచే నీళ్లను మళ్లించుకుంటామని సీఎం కేసీఆర్‌‌ తేల్చిచెప్పారు. పోతిరెడ్డిపాడు సహా ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను ఆపాలని డిమాండ్‌‌ చేశారు. లేకుంటే అలంపూర్‌‌-పెద్దమారూర్‌‌ మధ్య కృష్ణా నదిపై బ్యారేజీ నిర్మించి రోజుకు మూడు టీఎంసీల నీటిని తాము కూడా ఎత్తిపోస్తామన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌‌ షెకావత్‌‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన రెండో అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌లో కేసీఆర్‌‌ రాష్ట్రం తరఫున వాదనలు వినిపించారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్టే నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే ఇకపై నడవదని, రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటామని ప్రకటించారు. నీళ్లు పంచుడులో అన్యాయం జరిగినందుకే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందన్నారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని డిమాండ్‌‌ చేశారు. ఏపీ రీ ఆర్గనైజేషన్‌‌ యాక్ట్‌‌లోని సెక్షన్‌‌-89 కింద బ్రజేశ్‌‌ ట్రిబ్యునల్‌‌కు ‘టర్మ్స్‌‌ ఆఫ్‌‌ రిఫర్సెన్సెస్‌‌’ ఏర్పాటు చేసి ప్రాజెక్టుల వారీగా నీళ్లు కేటాయింపులు చేయాలన్నారు. బేసిన్‌‌ అవసరాలు తీరిన తర్వాతే బేసిన్‌‌ అవతలికి నీటిని తరలించాలన్నారు. ఏపీ కృష్ణా నీళ్లను బేసిన్‌‌ అవతలికి తరలించడానికి వీల్లేదని, ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, కృష్ణాబోర్డు ఆ రాష్ట్రానికి చెప్పాయన్నారు. తెలంగాణలో కొనసాగుతున్నవి ఉమ్మడి ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులేనని, గోదావరిలో తమకు కేటాయించిన 967.94 టీఎంసీలకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పారు. తాము నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ బహిరంగమేనని, వాటిలో దాచేదేం లేదన్నారు. ప్రాజెక్టుల్లో కొన్ని మార్పులు చేయడంతోనే డీపీఆర్‌‌లు ఇచ్చేందుకు కొంత టైమ్‌‌ తీసుకోవాల్సి వస్తుంది తప్ప.. డీపీఆర్‌‌లు ఇవ్వడానికి తమకేమీ అభ్యంతరం లేదన్నారు. తమ సర్కార్‌‌ అడ్డు చెప్పడంతో కేంద్ర జలశక్తి శాఖ సంగమేశ్వరం (రాయలసీమ) ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని ఏపీకి లెటర్‌‌ రాసిందన్నారు. కేంద్రం క్లీయర్‌‌గా ఆర్డర్లు ఇచ్చినా ఏపీ ఆ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి పనులు చేస్తోందన్నారు. ఏపీ మొండివైఖరితో ప్రాజెక్టు పనులు చేస్తే తమ రైతుల అవసరాల కోసం మహారాష్ట్ర బాబ్లీ నిర్మించినట్టుగానే అలంపూర్‌‌ దగ్గర కృష్ణా నదిపై లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్టు కడుతామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల లొల్లి పరిష్కారానికి కేంద్రం ముందుకు వస్తే తెలంగాణ సహకారం అందిస్తుందన్నారు. నాలుగేండ్ల కింద జరిగిన మొదటి అపెక్స్‌‌ మీటింగ్‌‌లో చర్చించిన వివరాలను సరిగా రికార్డు చేయలేదని, ఈరోజు సమావేశంలో చర్చించి నిర్ణయించిన అంశాలను వీడియో, రాతపూర్వకంగా రికార్డు చేయాలన్నారు. కేంద్ర మంత్రి, సీంఎల సంతకాలు తీసుకున్న తర్వాతే మినిట్స్‌‌ను అధికారికంగా విడుదల చేయాలన్నారు.