బీజేపీ గెలిస్తే.. తండాకో సేవాలాల్ మందిరం

 బీజేపీ గెలిస్తే.. తండాకో సేవాలాల్ మందిరం

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని గిరిజన తండాల్లో సేవాలాల్ మహారాజ్ దేవాలయాలను నిర్మిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో కనీస వేతనాల్లేక వివక్షకు గురవుతున్న పూజారులకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఇవాళ సాయంత్రం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో పాతబస్తీకి చెందిన వందలాది మంది గిరిజనులతో బండి సంజయ్ సమావేశమయ్యారు.  కేసీఆర్ పాలనలో తెలంగాణకు, గిరిజనులకు జరుగుతున్న అన్యాయం గురించి ఈసందర్భంగా బండి సంజయ్ వివరించారు.  కేంద్రంలోని నరేంద్ర మోడీ  ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాల సమాచారాన్ని వివరించారు.  మోడీ  ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము..

సామాన్య కుటుంబంలో జన్మించిన ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించిన విషయాన్ని ఈసందర్భంగా బండి సంజయ్ గుర్తు చేశారు. మైనారిటీ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ అబ్దుల్ కలాంను, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. నిరంతరం పేదల అభ్యున్నతి కోసం తపించే వ్యక్తి మోడీ అని, అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఖ్యాతి కూడా మోదీకే దక్కుతుందన్నారు. ఈనెల 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు భారీ ఎత్తున గిరిజనులంతా తరలివచ్చి మోడీకి మద్దతు పలకాలని కోరారు.కార్యక్రమంలో అఖిల భారత బంజారా సంఘం నాయకులు క్రిష్ణా నాయక్,  జిల్లా ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షులు నేదునూరు కనకయ్యతోపాటు పలువురు సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.