
- రాష్ట్రంలో 25.64 లక్షల వ్యవసాయ బోర్లు
- ఆరేండ్లలో వేసినవే 6.40 లక్షలు
- యాసంగిలో బోర్ల కింద ఎక్కువగా సాగయ్యేది వరి పంటే
- ఆ పంటనే వద్దంటే భూములు పడావే అంటున్న రైతులు
హైదరాబాద్, వెలుగు: యాసంగిలో వరి వేయొద్దని సర్కారు చెప్పడంతో దాదాపు వ్యవసాయ బోర్లన్నీ మూలకుపడనున్నాయి. రాష్ట్రంలో బోర్ల కింద రైతులు ఎక్కువగా వరి పంటనే సాగు చేస్తుంటారు. అందుకు తగ్గట్టుగా పొలాల్లో అచ్చుకట్టుకుంటారు. ఇప్పుడు వరి వేయొద్దనడంతో బోర్లున్న రైతులు ఆగమైతున్నారు. అచ్చుకట్టుకున్న పొలాల్లో వరి తప్ప వేరే పంట వేసే అవకాశం ఉండదని చెప్తున్నారు. వరి పండించలేక బోర్లను బంద్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో పంట సరిగ్గా పండకపోయినా.. యాసంగిలో వరి వేస్తే అంతో ఇంతో మిగులుబాటు ఉంటదని, ఇప్పుడు వరి వద్దంటే ఎట్లా బతకాలని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25.64 లక్షల వ్యవసాయ బోర్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణ వచ్చిన తర్వాత వేసుకున్నవే 6.40 లక్షల దాకా ఉన్నాయి.
నడపకపోతే ఎత్తిపోతయ్
ఒక్క సీజన్ మొత్తం బోర్లు నడపకుండా ఉంచితే.. మోటర్లు పాడైపోయి, బోర్లు ఎత్తిపోతాయని రైతులు అంటున్నారు. ఇప్పుడు యాసంగి సీజన్లో అంటే.. మే వరకు దాదాపు ఐదు నెలలు బోర్లు బంద్ పెట్టాల్సి వస్తుందని, ఇట్ల చేస్తే వానాకాలం సీజన్‌కు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్తున్నారు. యాసంగిలో రాష్ట్రంలో ప్రధానంగా సాగయ్యే పంట వరినే. రైతు సమగ్ర సర్వే ప్రకారం నిరుడు యాసంగిలో 52.79 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో 46 లక్షల ఎకరాలు బోర్ల కిందనే సాగైంది.
ఒక్కో బోరుకు రూ. లక్షపైనే
ఒక్కో బోరు వేయించి దానికి మోటార్ బిగించే వరకు అయ్యే ఖర్చు లక్ష రూపాయలు దాటుతుంది. ఇందులో బోరు వేసేందుకు కనీసంగా రూ.35- వేల నుంచి 40 వేలు, మోటార్‌కు రూ. 30 వేలు, పైపులు, కరెంట్ కనెక్షన్ ఇతరత్రా ఖర్చులు కలిపితే మొత్తం రూ. లక్ష దాటుతుంది. భూగర్భ జలాలు పైకి ఉంటే తక్కువ ఫీట్లకు, లేదంటే ఎక్కువ ఫీట్ల వరకు బోరు వేయాల్సి ఉంటుంది. రైతులు ఒక్క బోరు సక్సెస్ కాకపోతే రెండు, మూడు బోర్లు వేయిస్తుంటారు. ఏడాదిన్నర కిందట కరోనా మొదటి వేవ్‌లో పట్నాల నుంచి పల్లెలకు చేరిన వలస జీవులు కూడా వారికున్న ఎకరం, రెండు ఎకరాల భూముల్లో వరి వేసుకునేందుకు లక్ష రూపాయల పైనే ఖర్చు చేసి కొత్త బోర్లు వేసుకున్నారు. మరికొంత మంది వట్టిపడిపోయిన బోర్లను తిరిగి కడిగించుకుని బాగు చేయించుకున్నారు. ఈ ఏడేండ్లలో బాగుచేయించుకున్న బోర్లే 4.23 లక్షల వరకు ఉన్నాయి. ఇప్పుడు వరి వేయొద్దని సర్కారు చెప్తుండటంతో వేరే పంట వేసే అవకాశం లేక భూములను పడావు పెట్టాల్సి వస్తుందని, బోర్లన్నీ ఉత్తగనే ఉంచాల్సి వస్తుందని రైతులు అంటున్నారు.
బోర్లు బంద్ పెడితే సర్కార్‌కు రూ.9 వేల కోట్లు మిగులు
వ్యవసాయ బోర్లకు ప్రభుత్వం ఉచిత కరెంట్‌ను అందిస్తున్నది. ఈ యాసంగిలో బోర్లన్నీ నడువకపోతే.. దాదాపు రూ. 8 వేల కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయని అంచనా. రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ రోజుకు 7 వేల మెగావాట్లు ఉంటే, గత యాసంగిలో వరి పంట సాగు సమయంలో మార్చి 26న అత్యధికంగా 13,609 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. సరిగ్గా వరి పంటలు పొట్ట దశలో ఉన్నప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యుత్ డిమాండ్ వినియోగం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 3న రాష్ట్రంలో ఒక్కరోజులోనే 28.30 కోట్ల యూనిట్ల కరెంట్‌ను వినియోగించారు. ఇందులో సగం దాకా వ్యవసాయానికి అదీ వరి పంటకే వాడినట్లు విద్యుత్ సంస్థల అంచనా. రోజుకు యావరేజ్‌గా 6 వేల మెగావాట్ల కరెంట్ వ్యవసాయ బోర్లకు అవసరమవుతుందని గత యాసంగి లెక్కలు చూస్తే తెలుస్తున్నది. ఇలా నెలకు యావరేజ్ గా రూ. 2 వేల కోట్లు ఉచిత కరెంట్ కు రాష్ట్ర సర్కార్ చెల్లించాల్సి ఉంటుంది. 4 నెలల యాసంగికి ఉచిత కరెంట్‌కు రూ. 8 వేల కోట్లు అవుతాయి. ఇపుడు బోర్లు ఆపేస్తే ఈ మొత్తం సర్కారుకు మిగులుతుందని, విద్యుత్ వినియోగం తగ్గిపోతుందని రైతు సంఘాల నాయకులు అంటున్నారు.
క్రాప్ హాలిడే తప్పదేమో
మేలో లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేసి పొలంలో కొత్త బోరు వేయించిన. పాత బోరు ఉంటే దానిని రూ.30 వేలు పెట్టి కడిగిపించిన. ఉన్న రెండెకరాల భూమిని వరి సాగు కోసం అచ్చుకట్టిన. సీఎం కేసీఆర్, అగ్రికల్చర్ ఆఫీసర్లు వరి వద్దంటున్నరు. వేరే పంటలు వేసుకునే పరిస్థితి లేక ఈ సీజన్లో క్రాప్ హాలిడే అయ్యేటట్టున్నది.
- వెంకట్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా
ఎవుసం ఇడ్సి.. పట్నం బాట పట్టాల్నేమో
నాకు ఐదెకరాల భూమి ఉంది. రెండేండ్ల కిందటి దాకా పట్నంలో పనిచేసుకున్న. కరోనా రాంగానే ఊరికి వచ్చినం. భూమి ఉంది కదా అని మళ్లా పట్నం ఏం పోతమని అప్పు చేసి రెండు లక్షల రూపాయలు పెట్టి రెండు బోర్లు వేయించిన. రెండు సీజన్లు వరి పంట వేసిన. ఇంకా అప్పులు తీరలే. ఇప్పుడు సర్కారేమో వరి వద్దంటున్నది. పొలం అచ్చుకట్టుకున్న. దీంట్ల వరి తప్ప వేరేది పండదు. బోర్లను బంద్ పెడితే.. వట్టిపోతయ్. పంట వేస్తెనే చేతికి ఇన్ని పైసలు వచ్చి అప్పు తీరుతది. కానీ, ఆ పరిస్థితి లేదు. అప్పు తీర్చాలంటే మళ్లా పట్నం బాట పట్టుడే అయితదేమో.
- బి. కిష్టయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా