కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు సమస్యలు ఉండవు : జగ్గారెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు సమస్యలు ఉండవు  : జగ్గారెడ్డి

ధరణి పోర్టల్, రైతు సమస్యలపై  కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ధరణి వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సొంత భూమికి కూడా సరైన డేటా లేక చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు సమస్యల పట్ల జిల్లా కలెక్టర్లకు ఎలాంటి పట్టింపు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో గ్రామ రెవెన్యూ సదస్సులు ఉండేవని, అక్కడే రైతు సమస్యల పరిష్కారం జరిగేదని గుర్తు చేశారు. రైతులు రోజుల తరబడి కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ల సమస్యల్ని పట్టించుకునే వాళ్లు కరువయ్యారని మండి పడ్డారు.

ధరణిలో చాలా లోటుపాట్లు అనేక అవకతవకలు ఉన్నాయని అందుకే రైతుల పక్షాన హైకోర్టు లో పిల్ కూడా వేశామని జగ్గారెడ్డి తెలిపారు. అధికారుల నిర్లక్షంతో ఇప్పటివరకు ఆ పిల్ బెంచ్ మీదకు రాలేదన్నారు. ఇవాళ జరిగిన మీటింగ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి ఉంచాలా..  లేదంటే.. రైతు సమస్యలకోసం సరికొత్త విధానం ఏమైనా తీసుకురావాలా అనే దానిపై చర్చించామన్నారు. గంటన్నరపాటు జరిగిన ఈ మీటింగ్‌లో ధరణి మీదే కూలంకషంగా చర్చించినట్లు వెల్లడించారు.  

ఈ నెల 6 న పీసీసీ, సీఎల్పీ, ఇతర కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఒక కీలక ప్రెస్ మీట్ పెడతామన్నారు. మండలానికి 5గురి చొప్పున రాష్ట్రమంతటా సభ్యులను  ఏర్పాటుచేసి ధరణి డేటా సేకరిస్తామన్నారు. ఈనెల 11 న ప్రతి మండలంలో 3 వేల మందికి శిక్షణ, సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ధరణి, రైతుల సమస్యలపై స్పష్టమైన విధానాలతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. 20 లక్షల 30 వేల మంది రైతులు ధరణితో ఇబ్బందులు పడుతున్నట్లు కాంగ్రెస్ దృష్టికి వచ్చిందని చెప్పారు.