
కాగజ్ నగర్, వెలుగు: సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్లగా బైక్ లో పెట్టిన రూ.2.25 లక్షలు చోరీకి గురయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఆరెగూడకు చెందిన రైతు భీమన్కర్ ఇస్తారి ఇటీవల కొత్తపేట సహకార సంఘంలో తన భూమిని మార్ట్గేజ్ చేసి లోన్ తీసుకున్నాడు. బుధవారం ఉదయం కొడుకు ప్రభాకర్ తో బైక్ మీద కాగజ్ నగర్ కు వెళ్లి సహకార బ్యాంక్ లో రూ.2.25 లక్షలు డ్రా చేశాడు. సర్టిఫికెట్ పని మీద తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్లారు.
డ్రా చేసిన డబ్బులను బైక్ ట్యాంక్ కవర్ లో పెట్టి తండ్రిని చూస్తూ ఉండమని చెప్పి కొడుకు ఆఫీస్ లోపలికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో తమ గ్రామం వారు కనిపించడం తో ఇస్తారి వారి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తి బైక్ నుంచి నగదు సంచితో పరారయ్యాడు. అయితే దుండగుడు బైక్ నుంచి కవర్ తీసిన విషయాన్ని గమనించిన ఓ ఆటో డ్రైవర్ చెప్పడంతో వచ్చి చూడగా కవర్కనిపించలేదు. చుట్టుపక్కల గాలించినా ఫలితం లేదు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకున్నారు. సీసీ కెమెరాలు చెక్ చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రేమ్కుమార్తెలిపారు.