
హుస్నాబాద్, వెలుగు: దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ఓటు చోరీపై అనభేరి చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంతకాల సేకరణ చేపట్టారు. మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న లక్షల ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఓటు చోరీపై రాహుల్‌గాంధీ దేశ ప్రజల ముందు ఆధారాలతో బయటపెట్టారని తెలిపారు.
ఎన్నికల కమిషన్చర్యలు తీసుకోవాల్సింది పోయి రాహుల్‌గాంధీపై విచారణకు ఆదేశాలు జారీ చేయడం దురదృష్టకరమని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఏఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, డీసీసీ కార్యదర్శి రవీందర్, పద్మ, చందు, శ్రీనివాస్, బీక్యా నాయక్ పాల్గొన్నారు. .
విద్యార్ధి కుటుంబాన్ని ఆదుకుంటాం
విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వపరంగా అందే సాయం తప్పకుండా ఇచ్చి ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సాంఘీక సంక్షేమ స్కూల్ ను సందర్శించారు. విద్యార్థులు, టీచర్లు, ప్రిన్సిపాల్ ను విద్యార్థి ఎలా చనిపోయాడంటూ ఆరా తీశారు. మంత్రి మాట్లాడుతూ గత వారం, పది రోజుల కింద తోటి పిల్లలతో ఆడుకుంటూ విద్యార్థి వివేక్ ప్రమాదవశాత్తు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రన్సిపాల్‌ను ఆదేశించారు.
కార్యకర్తల అభిప్రాయాలు సేకరించాం : జ్యోతి రౌతేలా
డీసీసీ అధ్యక్ష పదవికి కార్యకర్తల అభిప్రాయాల సేకరణ చేపట్టామని ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రౌతేలా తెలిపారు. పట్టణ కేంద్రంలోని తిరుమల గార్డెన్ లో బ్లాక్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ హైకమాండ్‌కు ముగ్గురి పేర్లను అందిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, బొమ్మ శ్రీరామ్, మంజులా రెడ్డి, కేడం లింగమూర్తి, పూజల హరికృష్ణ పాల్గొన్నారు.