
కరీంనగర్ టౌన్, వెలుగు: గుండెపోటు వచ్చిన వ్యక్తులను సకాలంలో సీపీఆర్ చేస్తే బతికే అవకాశాలు ఉంటాయని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈనెల 13 నుంచి 17 వరకు సీపీఆర్ వారోత్సవాల సందర్భంగా కరీంనగర్‌లోని జనరల్ హాస్పిటల్‌లో బుధవారం సీపీఆర్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గుండెపోటు వచ్చిన వ్యక్తికి ప్రతి సెకన్ విలువైందన్నారు.
ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు సంభవిస్తుందని, ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యులకు కూడా సీపీఆర్‌పై అవగాహన ఎంతో అవసరమన్నారు. అనంతరం సీపీఆర్ పద్ధతులపై డాక్టర్లు డెమో చూపించారు. అనంతరం నషాముక్త్ భారత్ అభియాన్ ప్రారంభించి ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా జూనియర్ కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై వాల్ పెయింటింగ్ పోటీలు నిర్వహించారు.
అంతకుముందు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 325 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఎంహెచ్‌వో వెంకటరమణ, మెడికల్ కాలేజీ అడిషనల్ డీఎంఈ తక్యుద్దీన్ ఖాన్, సూపరింటెండెంట్ వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆడ శిశువులపై కలెక్టర్ పాట
‘ఓ చిన్ని పిచ్చుక.. చిన్నారి పిచ్చుక.. రావమ్మా నీ ఇంటికి’ అంటూ కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పాడిన పాట ఆకట్టుకుంటోంది. ఆడ శిశువును ఈ నేలపైకి ఆహ్వానిస్తూ కలెక్టర్ పాడిన పాటను యూ ట్యూబ్‌లో అప్ లోడ్ చేసి బుధవారం ఆవిష్కరించారు. హిందీలో స్వానంద్ కిర్కిరే అనే రచయిత రాసి పాడిన ఈ పాటను రచయిత, తెలుగు టీచర్ నంది శ్రీనివాస్ తెలుగులోకి అనువదించగా
కలెక్టర్ పాడారు.