కాంగ్రెస్ గెలిస్తే..ఇండ్లు, బంగారం గుంజుకుంటది: ప్రధాని మోదీ

కాంగ్రెస్ గెలిస్తే..ఇండ్లు, బంగారం గుంజుకుంటది: ప్రధాని మోదీ
  •     బండి, భూమి ఏమున్నా వదిలేట్టు లేదు 
  •     మండిపడ్డ కాంగ్రెస్​.. ఈసీకి ఫిర్యాదు
  •     ఆస్తులు లెక్కిస్తమని రాహులే అన్నడు.. ఎక్కువుంటే లాగేసుకుని పంచేస్తరట
  •     చట్టంలో మార్పులకు ప్లాన్ చేస్తున్నరు.. అలీగఢ్​ ర్యాలీలో మోదీ

దేశ ప్రజల ఆస్తులు, బంగారంపై కాంగ్రెస్​ కన్నేసిందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇండ్లు, బంగారం గుంజుకుంటుందని ప్రధాని మోదీ మరోసారి అన్నారు. రాజస్థాన్​లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఇవే వ్యాఖ్యలు చేసిన మోదీ.. సోమవారం యూపీలోని అలీగఢ్​ వేదికగా వాటిని రిపీట్​ చేశారు. ‘‘కాంగ్రెస్ మేనిఫెస్టో.. దేశ ప్రజలకు ఓ హెచ్చరిక. కాంగ్రెస్, ఇండియా కూటమిలోని పార్టీలన్నీ మీ ఇన్​కమ్, ఇండ్లు, బంగారంపై కన్నేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ ఆస్తి, బంగారాన్ని అందరికీ పంచుతామని చెప్తున్నది’’  అని వ్యాఖ్యానించారు. కాగా, మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్​ మండిపడింది. ఫస్ట్​ ఫేజ్​ ఎన్నికల్లో ఇండియా కూటమికే మెజార్టీ స్థానాలు దక్కనున్నాయని తెలియడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు మోదీ ఈ కామెంట్లు చేస్తున్నారని కాంగ్రెస్​ చీఫ్​ మల్లికార్జున ఖర్గే అన్నారు. 
మోదీ వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్​ ఫిర్యాదు చేసింది.

న్యూఢిల్లీ: రాజస్థాన్‌  ఎన్నికల ప్రచారంలో ఆదివారం మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగగా.. సోమవారం ఉత్తరప్రదేశ్​లోని అలీగఢ్ వేదికగా ప్రధాని మరోసారి అదే తరహా కామెంట్లు చేశారు. కాంగ్రెస్​తో పాటు ఇండియా కూటమిలోని పార్టీలపై విరుచుకుపడ్డారు. దేశ ప్రజల ఆస్తులు, బంగారంపై కాంగ్రెస్ కన్నేసిందని, అధికారంలోకి వస్తే రెండు ఇండ్లున్న వాళ్ల నుంచి ఒక ఇంటిని లాక్కుంటుందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అలీగఢ్​లో నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ మేనిఫెస్టో.. దేశ ప్రజలకు ఓ హెచ్చరిక.

కాంగ్రెస్, ఇండియా కూటమిలోని పార్టీలన్నీ మీ ఇన్​కమ్, ఇండ్లు, బంగారంపై కన్నేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరు ఎంత సంపాదిస్తున్నరు? ఆస్తి ఎంత.. ఇండ్లు ఎన్ని, బంగారం  ఎంత..  అనే వాటిపై సర్వే చేస్తామని రాహుల్ గాంధీ అన్నాడు. మీ ఆస్తి, బంగారాన్ని అందరికీ పంచుతామని కాంగ్రెస్ చెప్తున్నది. వారి మేనిఫెస్టోలో కూడా ఇదే ఉన్నది. మన అమ్మానాన్న, చెల్లెళ్ల వద్ద ఎంతోకొంత బంగారం ఉంటది. కష్టపడి కొనుక్కున్న వస్తువు.. అది వాళ్ల ఆత్మగౌరవానికి ప్రతీక. అలాంటి ఆత్మగౌరవంపై కాంగ్రెస్ కన్నేసింది. బంగారం లెక్కలు తీసి పంచేస్తామని అంటున్నది’’ అని మోదీ ఆరోపించారు. 

సర్వే చేసి ఆస్తులు లాక్కునేందుకు ప్లాన్

మహిళల వద్ద ఉన్న బంగారానికి చట్టాలు కూడా రక్షణ కల్పిస్తాయని మోదీ అన్నారు. అలాంటి చట్టాలను మార్చే యోచనలో కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు ఉన్నాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషియో ఎకనామిక్, కుల గణన చేపడ్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్తున్నదని వివరించారు. ప్రజల వద్ద ఉన్న ఆస్తులు, బంగారం వివరాలన్నీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ‘‘ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు సోషియో ఎకనామిక్ సర్వే చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పింది.

జీతాలు తీసుకునేవాళ్లు.. బ్యాంకుల్లో ఫిక్స్​డ్ డిపాజిట్లు ఎన్ని ఉన్నయ్? ఎంత పెట్టుబడి పెట్టారు? వారికి ఎన్ని వెహికల్స్ ఉన్నయ్? ఎంత భూమి ఉంది? అనే విషయాలు తెలుసుకోవాలని చూస్తున్నది. ఇలా సర్వే చేసిన అంశాల ఆధారంగా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు చట్టాన్ని మార్చాలనుకుంటున్నది. ఎవరికైనా గ్రామంలో పాత ఇల్లు ఉండి.. సిటీలో కొత్త ఫ్లాట్ కొన్నారనుకోండి.. అందులో ఒక ఇంటిని కాంగ్రెస్ గుంజుకునేందుకు ప్లాన్ చేస్తున్నది. ఒక ఇల్లు ఉంటే.. ఇంకో ఇల్లు వేరే వాళ్లకు కట్టబెట్టేందుకు చూస్తున్నది. కాంగ్రెస్ మావోయిస్టుల తరహాలో ఆలోచిస్తున్నది. కమ్యూనిస్టులు కూడా ఇలాగే ఆలోచిస్తరు. ఈ తరహా ప్లాన్​ను దేశవ్యాప్తంగా అమలుచేసి దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నది.

దోచుకోవడం రాజవంశీయుల జన్మహక్కు

రాజవంశీయులు దేశ ప్రజలను దోచుకొని తమ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారని పరోక్షంగా సోనియా గాంధీ ఫ్యామిలీని ఉద్దేశిస్తూ మోదీ ఆరోపణలు చేశారు. ప్రజలను దోచుకోవడం వారి జన్మహక్కు అనుకుంటున్నారని విమర్శించారు. ‘‘ఇండియా కూటమి అభ్యర్థులు భవిష్యత్తుపై ఆశలు పూర్తిగా కోల్పోయారు. దోచుకోవడం, దాచుకోవడం పైనే దృష్టి పెట్టారు. ప్రజలను మళ్లీ మోసం చేసేందుకే అధికారంలోకి రావాలనుకుంటున్నారు’’ అని మోదీ విమర్శించారు. పేద, అణగారిన వర్గాల అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకున్నదన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీ ప్రజలంతా మిగిలిన వారితో సమానంగా అభివృద్ధి సాధించలేకపోయారని తెలిపారు. 

ముస్లింలతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు

ముస్లింలతో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది తప్ప వారి ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం మార్చలేదని మోదీ విమర్శించారు. గతంలో అలీగఢ్​లో బాంబు పేలుళ్లు సాధారణమైపోయి రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం అలాంటివేవీ లేవన్నారు. దీనికి మోదీ, యోగి మ్యాజిక్కే కారణమన్నారు. ‘‘కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఎప్పుడూ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ పబ్బం గడిపాయి. ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడలేదు. వారి రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం నేనేమీ చేయ లేదంటున్నారు.

అణగారిన ముస్లింల దుస్థితిపై చర్చిస్తే కాంగ్రెస్, ఎస్పీ నేతల వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ముస్లింల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కాంగ్రెస్ లాక్కుంది. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు న్యాయం చేశాం’’ అని అన్నారు. దేశ హజ్ కోటా పెంచడంతో పాటు వీసా ప్రాసెస్ సులభతరం చేశామ న్నారు.పదేండ్లలో చేసింది ట్రైలర్ మాత్రమే,  ఇంకా చాలా పని ఉందని మోదీ తెలిపారు.