‘ఫీజులు’ ఇవ్వకుంటే  కాలేజీలెట్ల నడుపాలి?

‘ఫీజులు’ ఇవ్వకుంటే  కాలేజీలెట్ల నడుపాలి?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండేండ్ల నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్​లు ఇవ్వడం లేదని, కాలేజీలు ఎలా నడపాలని కేజీ టూ పీజీ ప్రైవేటు విద్యాసంస్థల మేనేజ్​మెంట్ల సంఘం రాష్ట్ర కన్వీనర్ గౌరీసతీశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్టూడెంట్ల నుంచి ఫీజులు వసూలు చేయకుండా, సర్కారు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా నెలనెలా లెక్చరర్లకు, సిబ్బందికి జీతాలు చెల్లించడం కష్టంగా ఉందనీ చెప్పారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ బకాయిలు రిలీజ్ చేయకపోతే, తమ కార్యచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. గురువారం టీపీజేఎంఏ ఆఫీసులో ఆయన ప్రైవేటు విద్యాసంస్థల సంఘం ప్రతినిధులు ఇంద్రసేనారెడ్డి, ఎస్ఎన్​రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఇంటర్, డిగ్రీ, పీజీ స్టూడెంట్లు 9 లక్షలకు పైగా ఉన్నారనీ, వారికి ఏటా రూ.226 కోట్లు అవసరమని చెప్పారు. 2021–22 కు సంబంధించి గతేడాది అక్టోబర్​లోనే బీఆర్వోలు, టోకెన్లు వచ్చిన రూ.86.55 కోట్లు పెండింగ్​లో ఉన్నాయనీ చెప్పారు. ఈ విద్యాసంవత్సరం ఒక్క పైసా రిలీజ్ కాలేదన్నారు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు పెట్టుకున్న కాలేజీల బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. తెలంగాణ వచ్చిన ఎనిమిదేండ్లలో మేనేజ్​మెంట్లు కట్టే ఇంటర్ అఫిలియేషన్, ఇన్స్​పెక్షన్ ఇతర ఫీజులు పలుమార్లు పెంచారనీ, కానీ స్కాలర్ షిప్​లు మాత్రం పెంచడం లేదన్నారు. ప్రస్తుతమున్న రూ.1940 ఫీజును ఐదువేలకు పెంచాలనీ, డిగ్రీ ఫీజులు 20వేల నుంచి 30వేల వరకూ పెంచాలని డిమాండ్ చేశారు.